ప్రతి ఒక్కరూ ఇంకుడుగుంతలు నిర్మించాలి
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జి.వి.పాటిల్ సూచన
భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 8)
ప్రతి భవనంపై పడిన వర్షపునీటి చుక్కను ఒడిసిపట్టే విధంగా ప్రతి ఒక్కరూ ఇంకుడుగుంతలు నిర్మించాలని, తద్వారా భూగర్భజలాల అభివృద్ధికి తోడ్పడాలని, ఈ పనిలో అందరూ సహకరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ కోరారు. చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీలో నిర్మించిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ (ఇంకుడు గుంత)ను గురువారం కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలకు ప్రతిఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించి, భావితరాల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యానగర్ పంచాయతీలో వినూత్నంగా కనిపించిన గడ్డి తొలగించే యంత్రాన్ని పరిశీలించారు. ఆ యంత్రం పనివిధానం చాలా బాగుందని, ఇలాంటి యంత్రాలు అందరూ ఉపయోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీ కార్యాలయం ఆవరణలో పనస మొక్క నాటిన ఆయన, ఆరుమొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించి, అందరూ మొక్కలు నాటేలా ఛైతన్యం కలిగించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్, డీఆర్డీఓ విద్యాచందన, చుంచుపల్లి తహసిల్దార్, విద్యానగర్ ప్రత్యేకాధికారి పానెం కృష్ణ, ఎంపీడీఓ వి.అశోక్ కుమార్, ఎంపీఓ సత్యనారాయణ, ఈజీఎస్ ఈసీ పి.నాగరాజు, పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.