Divitimedia
Bhadradri KothagudemBusinessCrime NewsEducationHealthHyderabadKhammamLife StyleNalgondaNational NewsSpecial ArticlesSportsSuryapetTechnologyTelangana

‘ఒక్కరి’ కోసం… డిపార్ట్ మెంట్ నే ‘బలి చేస్తున్నారు…’.

‘ఒక్కరి’ కోసం… డిపార్ట్ మెంట్ నే ‘బలి చేస్తున్నారు…’.

‘టీజీఈడబ్ల్యుఐడీసీ’లో పేరుకుపోయిన దుస్థితి…

ఖమ్మం జిల్లాలో పనులన్నీ ‘పీఆర్’కు బదిలీ చేసిన కలెక్టర్

✍️ హైదరాబాదు – దివిటీ (ఆగస్టు 8)

ఒకే ఒక్క అధికారి కోసం ఏకంగా ఆ ‘డిపార్ట్ మెంట్’నే బలిచేస్తున్నారు… బాధ్యత కలిగిన స్థానంలో ఉండి కూడా ఆ అధికారి చేస్తున్న నిర్వాకం ఏకంగా ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ఇబ్బందులపాలు చేసే దుస్థితి తలెత్తింది… రెండు జిల్లాల్లో అభివృద్ధి పనులు పర్యవేక్షించాల్సిన ఆ ఉన్నతాధికారి అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆ డిపార్ట్ మెంట్ చూస్తున్న పనులను పంచాయతీరాజ్ శాఖకు బదలాయించాల్సి వచ్చింది… ఇంత జరుగుతున్నప్పటికీ ఆ ఉన్నతాధికారి ఎక్కడున్నారనే విషయం ఆయన కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందికే తెలియడంలేదు… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’ సంస్థ కార్యకలాపాలలో నెలకొన్న దుస్థితిపై “దివిటీ మీడియా” ప్రత్యేక కథనం…

రాష్ట్రంలో విద్య, వైద్య, తదితర శాఖలలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులు పర్యవేక్షించేలా తెలంగాణ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (టీజీఈడబ్ల్యుఐడీసీ) అనే ప్రత్యేక సంస్థ పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సంస్థకు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పర్యవేక్షణకోసం ఓ కార్యనిర్వాహక ఇంజనీర్(ఈఈ) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాలయం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కస్తూర్బా విద్యాలయాలు, పాఠశాలల భవనాలతోపాటు ఇతర సంస్థల్లో అభివృద్ధిపనులు పర్యవేక్షిస్తున్న సంస్థ ఖమ్మం ‘ఈఈ’గా ఉన్న నాగశేషు, గత జులై 8వ తేదీ నుంచి (నెలరోజులకు పైగా) అందుబాటులో లేరు. ఈ దుస్థితి నేపథ్యంలో ఇటీవల ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతిపై గత నెల(జులై) 24న చేసిన సమీక్షకు కూడా ఈఈ గైర్హాజరు కావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు ఈఈ కార్యాలయం నుంచి వెళ్లిన ఉద్యోగి కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోవడంతో ఆగ్రహించిన కలెక్టర్, షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అసలు కార్యాలయానికే రాకుండా, కలెక్టర్ సమీక్షకు కూడా హాజరు కాకుండా ఈఈ నాగశేషు ఏం చేస్తున్నారనేది అర్థంకావడం లేదు. ఇంతటి దారుణమైన పరిస్థితులలో ఖమ్మం జిల్లాలోని పాఠశాలల్లో “అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీల” ద్వారా ఆ సంస్థ పర్యవేక్షణలో జరుగుతున్న పనుల పురోగతి కూడా ఘోరంగా మారింది. పనుల్లో పురోగతి లేదనే కారణంతో ఖమ్మంజిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఆ జిల్లాలో “టీజీఈడబ్ల్యుఐడీసీ” పర్యవేక్షిస్తున్న మొత్తం 102 పనుల్లో ఏకంగా 75 పనులు “పంచాయతీరాజ్ శాఖ”కు బదిలీ చేశారు. చింతకాని మండలంలో 8, కొణిజర్లలో 12, ముదిగొండలో 24, వైరాలో 17 పనులు పంచాయతీరాజ్ శాఖ ఖమ్మం ఈఈకి, తల్లాడ మండలంలోని 14పనులు సత్తుపల్లి ఈఈకి బదిలీ చేశారు. ఈఈ అందుబాటులో లేకపోవడం, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించకపోవడం వల్ల ఉమ్మడి ఖమ్మంజిల్లాలో టీజీఈడబ్ల్యుఐడీసీ సంస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడింది.
—————-
అసలు ఈఈ నాగశేషు ఎక్కడున్నారు?… టీజీఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర అధికారులు ఏంచేస్తున్నట్టు?
—————–
అసలు టీజీఈడబ్ల్యుఐడీసీ ఖమ్మం ఈఈ నాగశేషు ఎక్కడున్నారనేది అంతుచిక్కడం లేదు. ఆయనను కలిసేందుకు, కనీసం ఫోన్లో సంప్రదించేందుకు జులై 8వ తేదీ నుంచి “దివిటీ మీడియా” విఫలయత్నం చేసింది. ఆయన ఫోన్లో స్పందించకపోవడంతో నేరుగా ఖమ్మం కార్యాలయంలో కలిసేందుకు పలుమార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. ఆయన కార్యాలయానికి వస్తే తెలుసుకునేందుకు ప్రతిరోజూ సిబ్బందికి ఫోన్లు చేస్తున్నా, ఈఈ కార్యాలయానికి రాలేదని, ఎక్కడకు వెళ్లారో కూడా తమకు తెలియదనే సమాధానమే ఆ కార్యాలయం నుంచి వస్తోంది. ఆరా తీస్తే ఆయన తన వ్యక్తిగత పనుల్లో ‘బిజీగా’ ఉన్నట్లు తెలుస్తోంది. ఈఈ నాగశేషు అందుబాటులో లేకపోతే ఆయన స్థానంలో వేరే అధికారికి బాధ్యతలు అప్పగించకపోవడం వెనుక ఏం జరుగుతోందనేది కూడా అంతుబట్టడం లేదు. ఒక ప్రభుత్వ సంస్థలో రెండు జిల్లాల బాధ్యతలు చూస్తున్న అధికారి నెలరోజుల నుంచి కార్యాలయానికే రాకపోతే ఆ సంస్థ రాష్ట్ర అత్యున్నతాధికారులు ఎందుకు ఏమీ పట్టించుకోవడం లేదనేది ‘మిస్టరీ’గా మారింది.
——————–
ఈఈ నాగశేషు సెలవులో ఉన్నారు… ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం : టీజీఈడబ్ల్యుఐడీసీ ఛీఫ్ ఇంజనీర్ అనిల్ కుమార్
———————
తమ సంస్థ ఖమ్మం ఈఈ నాగశేషు సెలవులో ఉన్నారని, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని టీజీఈడబ్ల్యుఐడీసీ ఛీఫ్ ఇంజనీర్ అనిల్ కుమార్, “దివిటీ మీడియా”కు వివరించారు. చోటుచేసుకున్న పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు మాత్రం ఆయన ఇష్టపడలేదు.

Related posts

ఆశ్రమ విద్యాలయం తనిఖీ చేసిన ఎస్పీ

Divitimedia

విద్యార్థులకు సామగ్రి పంపిణీ చేసిన ఎంఈఓ

Divitimedia

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

Divitimedia

Leave a Comment