ఖమ్మం, వరంగల్ రైల్వేలైన్ల అలైన్ మెంట్ మార్చండి
దక్షిణమద్య రైల్వే జీఎంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ
✍️ ఖమ్మం, హైదరాబాదు – దివిటీ (ఆగస్టు 7)
ఖమ్మం, వరంగల్ జిల్లాల మీదుగా దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఏర్పాటు చేయనున్న రైలు మార్గాల్లోని అలైన్ మెంట్ లో మార్పులు చేయాలని తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాదులోని రైల్ నిలయంలో జీఎం అరుణ్ కుమార్ జైన్ తో రాష్ట్రమంత్రి పొంగులేటి సమావేశమయ్యారు. డోర్నకల్ నుంచి ఖమ్మంజిల్లాలో కూసుమంచి మండలంలో నాయకన్ గూడెం మీదుగా సూర్యాపేట జిల్లాలోని మోతె నుంచి గద్వాల్ వరకు ప్రతిపాదించిన నూతన రైల్వేలైన్ అలైన్ మెంట్ గురించి చర్చించారు. ఖమ్మంజిల్లాలోని తన నియోజకవర్గం పాలేరులోని నాలుగు మండలాల మీదుగా రైల్వే లైన్ వెళ్తుందని, దీనివల్ల రైతులు తమ సాగుభూమలను కోల్పోవలసి వస్తుందని తెలిపారు. ప్రత్యామ్నాయంగా అలైన్ మెంట్ లో మార్పుచేసి మరో మార్గంలో రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) మాస్టర్ ప్లాన్ పరిగణనలోకి తీసుకుని వరంగల్ నగర బైపాస్ రైల్వేలైన్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ నగరాభివృద్దికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 2050కి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నదని వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ నష్కల్ నుంచి హసన్ పర్తి, నష్కల్ నుంచి చింతలపల్లి వరకు కొత్తగా నిర్మించతలపెట్టిన రైల్వేలైన్ వరంగల్ మాస్టర్ ప్లాన్ కు అనుసంధానం చేయాలని మంత్రి కోరారు. ప్రస్తుతం సిద్ధం చేసిన రైల్వే మార్గం వల్ల వరంగల్ మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అలైన్మెంట్ మార్చాలని జీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి శాఖ, ప్రత్యేక కార్యదర్శి డి.హరిచందన, తదితరులు పాల్గొన్నారు.