కేంద్ర బడ్జెట్ పై సారపాకలో సీపీఎం నిరసన
✍️ బూర్గంపాడు – దివిటీ (జులై 26)
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సారపాక సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బడ్జెట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కోటీశ్వరులు, శతకోటీశ్వరులకోసం తప్ప సామాన్య ప్రజలకు కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులలో బీజేపీ ఎంపీలు 8 మంది, కేంద్రం నుంచి ఇద్దరు మంత్రులుగా ఉండి కూడా తెలంగాణకు బడ్జెట్లో ఏమీ లేకుండా చేసిన ఘనత బీజేపీ కేంద్ర మంత్రులకే దక్కుతుందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి రూ.2 లక్షల కోట్లు కేటాయించాల్సింది పోయి కేవలం రూ.806వేల కోట్లకే పరిమితం చేయడం దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరారు. నిరుద్యోగులు దేశంలో కోట్లాదిమంది ఉండగా, ఈ బడ్జెట్ లో వారికి ఎటువంటి కేటాయింపులు లేకుండా చేసిన చరిత్ర కేంద్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. దేశంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, సామాన్య ప్రజలకు బడ్జెట్ ఉపయోగపడే పరిస్థితి లేదన్నారు.
రైతంగానికి మద్దతు ధర లేకుండా బడ్జెట్లో ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వాన్ని నిలుపుకోవడం కోసం బీహార్, గుజరాత్, ఆంధ్ర రాష్ట్రాలకు నిధులు ఇచ్చారే తప్ప ఈ దేశప్రజల ప్రయోజనానికి ఉపయోగపడే బడ్జెట్ కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజిని, అబీదా, భయ్యా రాము,
కనకం వెంకటేశ్వర్లు, పి.చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.