ఆదమరిస్తే… అంతే సంగతులు…
ఇరుకురోడ్డులో పొంచి ఉన్న ప్రమాదం
✍️ టేకులపల్లి – దివిటీ (జులై 16)
అసలే ఇరుకైన సింగిల్ రోడ్డు… ఆ రోడ్డుమీద కల్వర్టు అప్రోచ్ కోతపడి మట్టికొట్టుకునిపోయి నడిరోడ్డు మీదే లోతైన గొయ్యి పడింది… ఆ మార్గంలో ప్రయాణికులకు ప్రాణాంతకంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో బొమ్మనపల్లి-శంభునిగూడెం మార్గంలో కల్వర్టు దుస్థితి ఇది. బొమ్మనపల్లి గ్రామానికి శివారులో ఉన్న కల్వర్టు ప్రమాదకరంగా తయారైందని స్థానికులు వాపోతున్నారు. రెండు వైపులా రహదారిపై గుంతలు పడిన ఈ కల్వర్టు శిథిలావస్థకు చేరి దాదాపు అయిదేళ్లు గడుస్తున్నప్పటికీ అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదు. నాలుగేళ్ల క్రితం బీటీ రోడ్డు నిర్మాణం సమయంలో కొత్త కల్వర్టు మంజూరు కాలేదనే సాకుతో కనీసం మరమ్మత్తులు కూడా చేయలేదని తెలుస్తోంది. శంభునిగూడెం, జి.కొత్తతండా, చంద్రుతండా గ్రామాల ప్రజలు ఈ మార్గంలోనే బొమ్మనపల్లి గ్రామానికి, అక్కడి నుంచి మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మార్గంలో నిత్యం వందలాది ఇసుక ట్రాక్టర్లు కూడా రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు పరిస్థితి మరింతగా దిగజారుతోంది. ఈనేపథ్యంలో ప్రమాదం జరగకముందే మరమ్మత్తులు చేయాల్సిన అవసరముంది. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని చెప్తున్న అధికారులు, కొత్త కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలోగా వెంటనే తాత్కాలిక ప్రాతిపదికనైనా మరమ్మత్తులు చేసి తమ ప్రాణాలు కాపాడాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.