వనమహోత్సవ లక్ష్యాలు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 2)
జిల్లాలో వనమహోత్సవం లక్ష్యాలు పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. వనమహోత్సవంలో భాగంగా శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాలపై మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లాకలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా అటవీశాఖాధికారి కృష్ణగౌడ్ తో కలిసి సమావేశం నిర్వహించారు. 2024-2025లో వనమహోత్సవంలో జిల్లా లక్ష్యం 65లక్షల 14వేలను అధిగమించేందుకు జిల్లా అధికారులు శాఖలవారీగా ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు జిల్లాలోని అటవీశాఖ నర్సరీ నుంచి మొక్కలు తీసుకునేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాకు కేటాయించే లక్ష్యం ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాల గుర్తింపు, గుంతల తవ్వకం చేపట్టాలన్నారు. మొక్కలు నాటడంతోపాటు మొక్కల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని తెలిపారు. పాఠశాలల ఆవరణలో మునగ, కరివేపాకు, చింత, ఉసిరి, వెలగ మొక్కలు తప్పకుండా ఉండాలని కలెక్టర్ విద్యాశాఖాధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని కాలువలకు ఇరువైపులా సుబాబుల్ మొక్కలు నాటాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.