సామగ్రి వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి : ఐటీడీఏ పీఓ
✍️ భద్రాచలం – దివిటీ (జూన్ 28)
జీసీసీ ద్వారా గిరిజనుల నుంచి సేకరించే అటవీ ఫలాలు, ఆశ్రమపాఠశాలలు, వసతిగృహాలకు సరఫరా చేసే సామగ్రికి సంబంధించిన ప్రతి వస్తువు రిజిస్టరులో నమోదు చేయాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశించారు. శనివారం పాల్వంచ జీసీసీ గోడౌన్, కార్యాలయంలోని రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజనుల నుంచి సేకరించే సీజనల్ అటవీ ఉత్పత్తులు దళారుల బారిన పడకుండా నేరుగా డీఆర్ డిపోలకే గిరిజనులు తీసుకొచ్చేలా సంబంధిత జీసీసీ మేనేజర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆశ్రమ పాఠశాలలకు, వసతిగృహాలకు, గురుకులాలకు సరఫరాచేసే బియ్యం, పప్పు, నూనెలు, కాస్మోటిక్స్, ఇతరసామగ్రి వివరాలన్నీ రిజిస్టరులో నమోదుచేయాలని స్పష్టం చేశారు. ఏయే పాఠశాలకు ఎంతెంత సరఫరా చేస్తున్నారనే వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో పాటు అదేవిధంగా గిరిజనుల నుంచి సేకరించే వివిధ రకాల అటవీ ఫలాల పరిమాణం, వారికి సకాలంలో పైకం అందిస్తున్న వివరాలు ఎప్పటికప్పుడు రిజిస్టరులో నమోదు చేయాలన్నారు. మారుమూల ప్రాంతాలకు చెందిన ఆదివాసీలకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జీసీసీ సిబ్బంది ఇంటింటికి తిరిగి, సేకరించే అటవీ ఫలాలు డీఆర్ డిపోలకే ఇచ్చే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు. జీసీసీ గోడౌన్లలో భద్ర పరిచే సామగ్రి పాడైపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పీఓ ఆదేశించారు. బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ముక్కిపోయి పురుగులు పట్టే అవకాశం ఉందని, స్టాక్ వచ్చిన వెంటనే సంబంధిత పాఠశాలలకు, వసతి గృహాలకు సరఫరా చేయాలని తెలిపారు. సీజన్ల బట్టి సరఫరా చేసే పండ్లు తాజావి మాత్రమే అందించాలని అన్నారు. ముఖ్యంగా బాలికల ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేసే కాస్మోటిక్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన జీసీసీ సిబ్బందికి సూచించారు. అనంతరం రికార్డులను రిజిస్టర్లను ,బిల్లు బుక్కులను, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి (జనరల్) డేవిడ్ రాజ్, డీడీ (ట్రైబల్ వెల్ఫేర్) మణెమ్మ ,ఏటీడీఓ చంద్రమోహన్, జీసీసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.