Divitimedia
Bhadradri KothagudemEducationHealthHyderabadLife StyleNational NewsSpot NewsTelanganaWomen

పూర్వ ప్రాథమికవిద్య కేంద్రాలుగా అంగన్వాడీల అభివృద్ధి

పూర్వ ప్రాథమికవిద్య కేంద్రాలుగా అంగన్వాడీల అభివృద్ధి

రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమశాఖ కార్యదర్శి వాకాటి కరుణ

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జూన్ 25)

అంగన్వాడీలను పూర్వ ప్రాథమిక విద్యాకేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఆమె మంగళవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు, జిల్లాస్థాయిలో చేపట్టాల్సిన చర్యలు, పిల్లల్లో పోషకలోపం నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలను వాకాటి కరుణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గడచిన 5నుంచి 6 సంవత్సరాలుగా చిన్నారుల సంక్షేమంకోసం కృషిచేసిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థల సహకారంతో అంగన్వాడీ సెంటర్ల అభివృద్ధికి కార్యాచరణ, పిల్లలకు నేర్పాల్సిన పాఠ్యాంశాలు, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రణాళిక రూపొందించామన్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక బుక్ లెట్ రూపొందించామని, జూలై మొదటి వారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యపై శిక్షణ పూర్తిచేయాలని కలెక్టర్లకు ఆమె సూచించారు. ప్రతి అంగన్వాడీ సెంటర్ లో ప్లేమ్యాట్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రస్థాయి నుంచి అందించడం జరుగుతుందన్నారు. జిల్లాస్థాయిలో సంక్షేమశాఖ వద్ద అందుబాటులోని నిధులతో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వాల్ పెయింటింగ్స్ వేయించాలన్నారు. సివిల్ పనుల కోసం మంజూరుచేసిన నిధులు వినియోగించుకుంటూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తాగునీరు, అవసరమైనంత టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్ మరమ్మత్తు మొదలగు పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాస్థాయిలో జరిగే అంగన్వాడీ శిక్షణ కార్యక్రమాలను కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, అంగన్వాడీ కేంద్రాలలోని పిల్లలకు ‘యూనిఫామ్’ అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జూలై నెలలో అంగన్వాడీ పూర్వ ప్రాథమిక విద్యాకేంద్రాలు ప్రారంభించేలోగా నిర్దేశించిన పనులు పూర్తిచేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, పోషక లోపం ఉన్న పిల్లలను గుర్తించి పౌష్టికాహారం అందించే విధంగా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోషకలోపం ఉన్న పిల్లలకు అదనంగా బాలామృతం అందిస్తున్నందున మెరుగైన ఫలితాలు వస్తున్నాయని, పిల్లలు సాధారణస్థితికి చేరుకున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా సంక్షేమాధికారి విజేత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఉప్పుసాకలో ఎన్.సి.సి విద్యార్థుల స్వచ్ఛతాహీ సేవ

Divitimedia

ఐసీడీఎస్ పనితీరు గాడిలో పడేదెన్నడో…?

Divitimedia

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

Divitimedia

Leave a Comment