సికిల్ సెల్ అనీమియా శాశ్వతంగా నివారించాలి
సెంట్రల్ ట్రైబల్ వెల్ఫేర్ జాయింట్ సెక్రెటరీ జయ
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జూన్ 24)
సికిల్ సెల్ అనీమియా వ్యాధిని శాశ్వత నివారణకు ఈ నెల 19నుంచి జులై 3వ తారీకు వరకు ట్రైబల్ ఏరియా లోని గిరిజనులకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి తప్పనిసరిగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయితే తప్పనిసరిగా చికిత్సలందించాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ జాయింట్ సెక్రెటరీ జయ అన్నారు. సోమవారం న్యూఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ పీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, గిరిజన గ్రామాలలో ఆదివాసీలకు సిఖిల్ సెల్ అనీమియా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆమె సమీక్షించారు. ఏజెన్సీలోని గర్భిణులు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ కార్యక్రమం ద్వారా గిరిజనులకు ఎటువంటి వ్యాధులు సోకకుండా సికిల్ సెల్ అనీమియా వ్యాధినిరోధం కోసం చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలలు, పి.హెచ్.సిలు, అంగన్వాడీ సెంటర్లలో ఈ వ్యాధి గురించి గిరిజనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, తప్పనిసరిగా చిన్నారుల నుంచి మొదలుకొని 40సంవత్సరాల లోపు ఉన్నవారికి స్క్రీనింగ్ టెస్టులు చేయాలన్నారు. వ్యాధి దరిచేరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు తప్పకుండా అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజు క్యాంపులు నిర్వహించి, స్క్రీనింగ్ టెస్టులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, సంబంధించిన రిపోర్టులు తప్పనిసరిగా పంపించాలని, క్యాంపులు, స్క్రీనింగ్ టెస్టుల ప్రగతిని వైద్యసిబ్బంది తప్పనిసరిగా పూర్తిచేసేలా వైద్యాధికారులు పర్యవేక్షణ చేస్తుండాలని సూచించారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 50 ఆశ్రమపాఠశాలలు, 23 పీఎం హాస్టళ్లు, 30 వసతి గృహాల్లోని విద్యార్థులకు, పల్లెల్లో ఆదివాసీలకు సికిల్ సెల్ అనీమియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, వ్యాధి గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, అదనపు డీఆర్డీఓ ఎన్.రవి, జిల్లా ఉపాధి కల్పనాధికారి విజేత, తదితరులు పాల్గొన్నారు.