రూ.90లక్షల విలువైన గంజాయి పట్టుకున్న పోలీసులు
గంజాయి రవాణాచేసేవారిపై కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ రోహిత్ రాజు
గంజాయి అక్రమ రవాణా సమర్థవంతంగా అరికడుతున్నామన్న ఎస్పీ
✍️ దివిటీ మీడియా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, టేకులపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు బుధవారం రూ.90 లక్షల విలువైన 360 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పాల్వంచ పట్టణంలోని జీసీసీ గౌడౌన్ ఎదురుగా బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో పాల్వంచ ఎస్సై-2 రాఘవ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలలో ఒక మారుతి బలెనో కారులో తరలిస్తున్న 202 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆ గంజాయి విలువ దాదాపు రూ.50.55లక్షలుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డొంకరాయి అటవీ ప్రాంతం నుంచి వికారాబాద్ జిల్లా, మోమిన్ పేట మండలానికి చెందిన మెగావత్ జైపాల్ అనే వ్యక్తి 100 ప్యాకెట్లలో ఆ నిషేధిత గంజాయిని కారులో తరలిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు.
టేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట్యాతండా వద్ద ఎస్సై సైదా రవుఫ్ తన సిబ్బందితో బుధవారం వాహన తనిఖీలు చేస్తుండగా ఒక మారుతి బ్రెజా కారులో గంజాయి పట్టుబడింది. కామారెడ్డి జిల్లాకు చెందిన పెనుగొండ వెంకటరాజు, బోదాసు తిరుపతి అనే వ్యక్తులు 79 ప్యాకెట్లలో 158 కిలోల గంజాయిని ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్ గిరి ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్ నకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ గంజాయి విలువ దాదాపు రూ.39.50లక్షలుంటుందని పోలీసులు ప్రకటించారు. ఈ రెండు ఘటనలలో దాదాపు రూ.90లక్షల విలువైన 360 కిలోల నిషేధిత గంజాయి, రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేసి, నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు పోలీసులు వివరించారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు తమ పోలీస్ సిబ్బంది బాగా పనిచేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే చట్టప్రకారం వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.