Divitimedia
Bhadradri KothagudemBusinessHyderabadJayashankar BhupalpallyKhammamLife StyleNational NewsSpot NewsTechnologyTelangana

సమయపాలన పాటించనివారిపై కఠినచర్యలకు శ్రీకారం

సమయపాలన పాటించనివారిపై కఠినచర్యలకు శ్రీకారం

సింగరేణిలో పని సంస్కృతి మెరుగుకోసం సీఎండీ ఎన్.బలరామ్ నిర్ణయం

✍️ కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ మీడియా (జూన్ 18)

ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించిన సంస్థ సీఎండీ ఎన్.బలరామ్, సంస్థలో పని సంస్కృతి మెరుగుపర్చేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. సంస్థకార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారుల సమయ పాలన పాటించనివారిపై కఠినచర్యలు తీసుకోవడం ద్వారా విధినిర్వహణ తీరు మెరుగుపడేలా ప్రత్యేకంగా దృష్టి సారించారు. సింగరేణి గనులు, కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు డ్యూటీలకు రాకపోయినా కూడా వారికి మస్టర్లు పడుతున్నాయని, మరి కొందరు మస్టర్ పడిన తర్వాత బయటకు వెళ్తున్నట్లు నిఘా వర్షాలతో వచ్చిన ఫిర్యాదులపై సీఎండీ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాదులోని సంస్థ కార్యాలయం సింగరేణి భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. భూగర్భ గనుల్లో పని ప్రదేశాలను సంబంధిత అధికారులు ప్రతిరోజూ తనిఖీ చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింగరేణిలో ఉద్యోగులు, అధికారులంతా ఇకపై రోజూ తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేసుకోవాలని, దీని అమలుపై ఆయా ఏరియా జీఎంలు, విభాగాధిపతులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భోజన విరామం పూర్తయిన తర్వాత నిర్ణీత సమయంలో మళ్లీ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లంచ్ బ్రేక్ లో చాలామంది మూడు గంటలపాటు విరామం తీసుకోవడం వల్ల వారి పనులు, ఫైళ్లు పెండింగులో ఉంటున్నాయని పలువురు సీఎండీ దృష్టికి తీసుకు రావడంతో, దీనిపై ఆయన సెక్యూరిటీ విభాగం ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు. గతంలో సింగరేణి సంస్థ ఆసుపత్రులు, డిస్పెన్సరీలలో వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులకు రాకపోతే మెమోలు జారీ చేసిన ఆయన ఇప్పుడు సమయ పాలన పాటించని వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సింగరేణి సంస్థలోని ప్రతి ఉద్యోగి, అధికారి కచ్చితమైన సమయపాలన పాటించాలని, డ్యూటీకి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళటం గానీ, పని చేయకుండా కూర్చోవడం గానీ చేయకూడదన్నారు. ఈ విషయంలో ఎంతటి పెద్దవారైనా, పలుకుబడి ఉన్నవారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బొగ్గు ఉత్పత్తికోసం కార్మికులు ఎనిమిది గంటలు పనిచేస్తున్నారని, వారికి సంబంధించి సంక్షేమం, ఇతరత్రా పనులు నిర్వర్తించే ఉద్యోగులు, అధికారులు మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో కొందరు ఏదో ఒక కారణం చూపి, తాము పనిచేసే కార్యాలయాలను వదిలి వరండాల్లో తిరగడం, బయటికి వెళ్లడం, కబుర్లతో కాలక్షేపం చేస్తే సంబంధిత విభాగాధిపతులపై చర్యలు ఉంటాయని సీఎండీ బలరామ్ హెచ్చరించారు. ఈ విషయంలో నిఘావిభాగం నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. సింగరేణి సంస్థ వ్యాపారవిస్తరణలో భాగంగా ఇతర రంగాల్లోకి కూడా అడుగులు పెడుతోందని, సంస్థ ఉత్పాదకత మరింత పెరగాల్సిన అవసరమెంతో ఉందన్నారు. ఇందుకోసం ఉద్యోగులు, అధికారులు క్రమశిక్షణతో తమ విధులు నిర్వర్తించడం అత్యవసరమన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగంతో పోటీ పడుతున్న సింగరేణి సంస్థ మనుగడ సాగాలంటే పనిగంటలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. క్రమశిక్షణ గల సంస్థగా సింగరేణిని రూపుదిద్దడంలో అందరూ సహకరించాలని కోరారు. అనేకమంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సంస్థ పట్ల అభిమానంతో, వేరెవరో చెప్పే అవసరం లేకుండానే తమకు ఇచ్చిన పనిని అంకిత భావంతో పూర్తి చేస్తున్నారని, డ్యూటీ సమయమంతా పని చేస్తున్నారని, అలాంటివారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కొందరు విధులకు గైర్హాజరవుతూ, మస్టర్ పడిన తర్వాత బయటకు వెళ్లడం, డ్యూటీలో ఉండి కూడా పనిచేయకుండా ఉంటున్నారని, ఇలాంటి వారి వల్ల ఇతరులు కూడా పాడైపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. పని సంస్కృతిని దెబ్బతీస్తే యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటుందని, అవసరమైతే క్రమశిక్షణ లేని ఉద్యోగులను విధుల నుంచి తొలగించడానికి వెనకాడబోమని సీఎండీ బలరామ్ హెచ్చరించారు.

కొత్తగూడెం కార్పోరేట్ లో 32 మంది ఆలస్యంగా

సంస్థ సీఎండీ ఆదేశాల మేరకు సింగరేణి సెక్యూరిటీ విభాగం మంగళవారం ఉదయం కొత్తగూడెంలోని సంస్థ కార్పోరేట్ ఆఫీసులో ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయాన్ని, భోజనానికి వెళ్లే సమయాలను రికార్డు చేశారు. ఈ సందర్భంగా విధులకు ఆలస్యంగా వచ్చిన 32మంది ఉద్యోగుల వివరాలను గుర్తించి, సంబంధిత శాఖలకు పంపించారు. ఆయా విభాగాల అధిపతులు వారిని మందలించారు. ఇకపై నిరంతర ప్రక్రియగా ఇలా సమయ పాలనను నమోదు చేయడం జరుగుతుందని సీఎండీ స్పష్టం చేశారు. ఉద్యోగుల పని సంస్కృతిని పరిశీలించేందుకు అన్ని ఏరియాల్లో జీఎంలు కార్యాలయాల్లో, గనుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఈ సందర్భంగా సీఎండీ బలరామ్ ఆదేశించారు.

Related posts

ట్రాక్టర్ల వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు తప్పనిసరి: ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

“ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల’పై అసత్య ప్రచారం మానుకోవాలి

Divitimedia

అంగన్వాడీ కేంద్రం మూసివేతపై ‘డీడబ్ల్యుఓ’ విచారణ

Divitimedia

Leave a Comment