బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్ జితేష్ వి పాటిల్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ మీడియా (జూన్ 16)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కలెక్టరుగా బదిలీపై వచ్చిన జితేష్ వి పాటిల్ ఆదివారం ఉదయం 10 :15 గంటలకు ఐడీఓసీలోని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన, పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులు పుష్పగుచ్చాలందించి జిల్లా నూతన కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ గా పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాల మేరకు అందరినీ సమన్వయం చేస్తూ జిల్లా ప్రజలకు సేవలందిస్తానని చెప్పారు.
*****************
ఐటీడీఏ పీఓగా అదనపు బాధ్యతలు చేపట్టిన కలెక్టర్
*************
భద్రాచలం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అదనపు బాధ్యతలు స్వీకరించారు.
ఆదివారం మధ్యాహ్నం ఐటీడీఏ పీఓ ఛాంబర్లో బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయన ఐటీడీఏ ఉద్యోగులకు తన గురించి పరిచయం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ 2016 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన తాను సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశానని, అర్బన్ ప్లానింగ్ లో మాస్టర్ డిగ్రీ పొందానని, పూణే, ముంబైలో ప్రైవేటు కంపెనీలో కొంతకాలం పాటు పనిచేశానని తెలిపారు. తొలిసారి సంగారెడ్డి ట్రైనీ కలెక్టర్ హోదాలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరానని, అనంతరం ఏడాది పాటు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వర్తించి, 2021 సెప్టెంబర్ 3న కామారెడ్డి జిల్లా కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించానని వివరించారు. తన తండ్రి విశ్వనాథపాటిల్ ఆర్మీలో పని చేసి రిటైరయ్యారని, తన మాతృమూర్తి రత్నమాల, తన సతీమణి పాటిల్ శారద గృహిణులని, తనకు ఒక కుమారుడు (పేరు రాఘవ) ఉన్నాడని ఆయనన్నారు. ఐటీడీఏ పీఓగా అదనపు బాధ్యతలు స్వీకరించడానికి భద్రాచలం వచ్చిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను ఆర్డీఓ దామోదర్ రావు, ఐటీడీఏ యూనిట్ అధికారులు కలిసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐటీడీఏ అధికారులు, ఉద్యోగులకు ఆయన తన ప్రాధాన్యాలను క్లుప్తంగా వివరించి, విధుల్లో వ్యవహరించాల్సిన తీరు గురించి తన వైఖరిని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి (జనరల్) డేవిడ్ రాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డీఆర్డీఓ విద్యాచందన, గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) మణెమ్మ, ఎస్ఓ సురేష్ బాబు, ఈఈ తానాజీ, ఆర్ఓఎఫ్ఆర్ డీటీ శ్రీనివాస్, ఏటీడీఓ నర్సింగరావు, డీఎస్ఓ ప్రభాకర్ రావు, జేడీఎం హరికృష్ణ, టీఏ శ్రీనివాస్, మేనేజర్ ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.
**************
భద్రాద్రి రాముడిని దర్శించుకున్న కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరుగా, భద్రాచలం ఐటీడీఏ పీఓ(అదనపు బాధ్యతలు)గా ఆదివారం బాధ్యతలు చేపట్టిన జితేష్ వి పాటిల్ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో దర్శనం చేసుకున్నారు. ఆయనకు రామాలయం ఈఓ రమాదేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పలువురు రెవెన్యూశాఖ, ఐటీడీఏ, ఇతర శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు కూడా కలెక్టరుకు స్వాగతం పలికారు.