రూ.75లక్షల విలువైన 186కిలోల గంజాయి పట్టివేత
ముగ్గురిని అరెస్టు చేసిన కొత్తగూడెం 1టౌన్ పోలీసులు
✍️ కొత్తగూడెం – దివిటీ మీడియా (జూన్ 13)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో గురువారం పోలీసులు దాదాపు రూ.75లక్షల విలువైన 186కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమకు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కొత్తగూడెం 1 టౌన్ ఎస్సై విజయ తన సిబ్బందితో కలిసి కొత్తగూడెం బస్టాండ్ సమీపంలోని అండర్ బ్రిడ్జి వద్ద గురువారం వెహికల్ చెకింగ్ చేశారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు స్విఫ్ట్ డిజైర్ కారు అనుమానాస్పదంగా కనిపించారు. ఆ కారును క్షుణ్ణంగా సోదా చేయగా మొత్తం 93 ప్యాకెట్లలో 186 కిలోల బరువు గల రూ.75 లక్షల విలువ చేసే నిషేధిత గంజాయి లభించింది. కారుతోపాటు గంజాయి స్వాదీనం చేసుకుని కారులోని ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి 1టౌన్ పోలీసులు ఈ గంజాయి పట్టుకున్నట్లు 1 టౌన్ సిఐ కరుణాకర్ వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం, ఎల్లంపేట్ గ్రామానికి చెందిన డ్రైవర్ పెనుగొండ నరసింహులు, కుంచం లక్ష్మణ్ తో పాటు ఆ పొరుగు గ్రామం నందితండాకు చెందిన భూక్యా లక్ష్మణ్ అనే నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. పట్టుబడిన ఈ ముగ్గురు నిందితులు ఒడిశా రాష్ట్రం, మల్కన్ గిరి అటవీప్రాంతంలో ఈ గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతంలో విక్రయించేందుకు తీసుకెళ్తుండగా వారిని పట్టుకున్నట్లు సిఐ వెల్లడించారు. ముగ్గురిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు తెలిపారు. ఈ వాహన తనిఖీలలో నిషేధిత గంజాయిని అక్రమంగా తరలించే నిందితులను పట్టుకున్న సీసీఎస్, 1టౌన్ పోలీసులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు.