ఆగస్టు 15 నాటికి సీతారామప్రాజెక్టు నీరు విడుదల
ప్రాజెక్టు సందర్శనలో మంత్రుల బృందం హామీ
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ మీడియా (జూన్ 13)
సీతారామ ప్రాజెక్టు నుంచి ఆగస్టు 15వ తేదీకల్లా జిల్లా పరిధిలోని రైతులకు సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రుల బృందం తెలిపింది. ఈ మేరకు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ప్రాజెక్టు పనుల క్షేత్ర పరిశీలన చేసిన సందర్భంగా రాష్ట్ర మంత్రుల బృందం ఈ పనుల పురోగతి తీరుతెన్నులను సమీక్షించింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, నీటిపారుదల, ఆహారం పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ప్రాజెక్టు సందర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలోని సీతారామ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటరీ వద్దకు హెలిక్యాప్టర్లో వచ్చిన మంత్రులు సీతారామ ప్రాజెక్టు వ్యూపాయింట్ నుంచి, ప్రాజెక్ట్ పనులు పరిశీలించారు. వ్యూపాయింట్ వద్ద నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాటుచేసిన సీతారామ ప్రాజెక్టు ఫోటో ప్రజెంటేషన్ ను మంత్రులు తిలకించారు. ఇప్పటివరకు పూర్తయిన సీతారామ ప్రాజెక్టు పనుల వివరాలను డిప్యూటీ సీఎం, మంత్రులకు నీటిపారుదలశాఖాధికారులు వివరంగా తెలియజేశారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్ హౌజ్-1 పనులు పరిశీలించి, కంట్రోల్ రూమ్ లో పవర్ సప్లైను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి ప్రారంభించారు. సీతారామసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వి.కె.రామారం గ్రామం వద్ద పంప్ హౌజ్- 2 పనులను కూడా మంత్రుల బృందం పరిశీలించింది. అనంతరం మంత్రులు ములకలపల్లి మండలంలోని పూసుగూడెం గ్రామంలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌజ్ -3 పనులు పరిశీలించారు. ప్రధానకాలువ వెంట 63కిలోమీటర్లు ప్రయాణం చేసిన మంత్రుల బృందం 6 గంటలపాటు సీతారామప్రాజెక్టు పనులు పరిశీలించిన తర్వాత నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్టు పనులు, జరుగుతున్న కాలువల పనులు, భూసేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి అవసరమైన నిధులు, ఇంకా ఎదురవుతున్న సమస్యలను ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు, మంత్రులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, మట్టా రాగమయి, కోరం కనకయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఇర్రిగేషన్ సిఇ శ్రీనివాసరెడ్డి, పలువురు నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.