అద్దెకున్న ఇంట్లోనే చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
బంగారం రికవరీ చేసిన కొత్తగూడెం 2టౌన్ పోలీసులు
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం (జూన్ 6)
కొత్తగూడెం 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్.సి.బి నగర్ ప్రాంతంలో తాను అద్దెకుంటున్న యజమానుల ఇంట్లోనే బంగారం చోరీ చేసిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కొత్తగూడెం 2టొన్ సీఐ రమేష్ విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.సి.బి నగర్ లో నివాసముండే మనోహర్ బాబు అనే వ్యక్తి ఇద్దరు పిల్లల్లో ఒకరు అమెరికాలో, మరొకరు బెంగళూరులో ఉంటున్నారు. దీంతో వృద్ధ దంపతులు వారి ఇంటి వద్దనే వేరేగా ఉంటున్నారు. వారి ఇంటి పై భాగంలోని పోర్షన్లో మహావీర్ అనే వ్యక్తి కుటుంబంతో సహా నాలుగు సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నారు. ఆ వృద్ధదంపతులతో స్నేహంగా, సన్నిహితంగా ఉంటూ మహావీర్, వారి ఇంటికి వేసే రెండవ తాళం తాళపు చెవిని దొంగిలించాడు. ప్రతిరోజు గుడికి పూజకు వెళ్లే ఆ దంపతుల అలవాటును అదనుగా భావించిన అతను వారు గుడికి వెళ్ళిన సమయంలో వారికి అనుమానం రాకుండా చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మహావీర్ ఆ ఇంటి తాళం తీసి, ఆ ఇంట్లోని బీరువాలో ఉన్న దాదాపు 117 గ్రాముల బంగారు ఆభరణాలైన నక్లెస్, చైను, నాలుగు గాజులు దొంగిలించి వాటిని తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. అత్యవసరంగా పని కోసం ఆ దంపతులు తెల్లవారుజామునే అమెరికా వెళ్లేందుకు సిద్ధమై, వారి ఇంట్లోని నగలు లేకపోవడంతో దొంగతనం జరిగిందని భావించారు. అమెరికా వెళ్లే హడావుడిలో ఆ దంపతులు చోరీ గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయకుండా వెళ్లిపోయారు. అమెరికా వెళ్లిన తర్వాత వారి మిత్రుడుకి ఫోన్ చేసి అతని సాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ చోరీ విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే అమెరికా నుంచి తిరిగి వచ్చిన మనోహర్ బాబు నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో వారి ఇంటిపై ఉంటున్న మహావీర్ అనే వ్యక్తి ఆ ఇంటిలో దొంగతనం చేశాడని గుర్తించారు. చోరీ చేసిన ఆ వస్తువులను బుధవారం అమ్మడానికి వెళుతుండగా చాకచక్యంగా నిందితుడిని గోధుమవాగు బ్రిడ్జి వద్ద పట్టుకుని అతన్ని విచారించగా దొంగతనం చేసింది తానేనని అంగీకరించాడని పోలీసు అధికారులు వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.7.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రికవరీ చేసి, అతడిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు పంపించినట్లు సీఐ రమేష్ వెల్లడించారు.