చర్చనీయాంశంగా మారిన జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు
✍️ దివిటీ మీడియా – హైదరాబాదు
రాజకీయాలకు దూరంగా ఉంటున్న ప్రముఖ సినిమా కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్, ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత స్పందించడం చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల తర్వాత రాజకీయపరమైన అంశాలకు, తెదేపా కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ సాధించిన ఘన విజయంపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబునాయుడు, లోకేష్, బంధువులతో పాటు పవన్ కళ్యాణ్ కు ఎన్నికల విజయాలపై శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యాంశంగా మారింది. వారి విజయాల పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజెన్లు, టీడీపీ కార్యకర్తల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.
” ప్రియమైన Nara Chandrababu Naidu మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన Nara Lokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన Nandamuri Balakrishna బాబాయికి, MPలుగా గెలిచిన Sribharat Mathukumilli కి, Daggubati Purandeswari అత్తకి నా శుభాకాంక్షలు.
అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన Pawan Kalyan గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.” అంటూ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.
మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా దాదాపు ఇదే తరహాలో స్పందిస్తూ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ సోదరుల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆలస్యంగా స్పందించారని, క్లిష్ట సమయంలో ముఖం చాటేసిన ఎన్టీఆర్ ఇప్పుడు స్పందించడం ఏమిటంటూ టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కొంతకాలంగా రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడటం, రాజకీయ వేదికలు పంచుకోవడం వంటివాటికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లోనే ఎన్టీఆర్ మిత్రుడు వల్లభనేని వంశీ, చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ వివాదంపై కూడా జూనియర్ ఎన్టీఆర్ అంతంతమాత్రంగానే స్పందించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చిన సందర్భంలోనూ తెదేపా వర్గాలు ఆశించిన స్థాయిలో స్పందించలేదు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూడా ముఖం చాటేశారు. ఈ ఎన్నికల్లో సినీ ప్రముఖులు కూటమికి మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేసినప్పుడు కూడా ఆయన స్పందించలేదని, టీడీపీ కూటమి విజయం సాధించిన తర్వాత శుభాకాంక్షలు తెలియజేయడంపై టీడీపీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో వల్లభనేని వంశీ, కొడాలి నాని ఓడిపోవడంతో ఎన్టీఆర్ భయంతోనే శుభాకాంక్షలు తెలిపారంటూ కొంతమంది టీడీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈ పరిస్థితుల్లో తెదేపా అధినేతకు, కుటుంబ సభ్యులకు జూనియర్ ఎన్టీఆర్ మనస్పూర్తిగానే శుభాకాంక్షలు తెలిపారని, దానిని కూడా రాజకీయంగా చూడటం తగదని ఆయన అభిమానులు టీడీపీ కార్యకర్తలకు హితవు పలుకుతున్నారు. ప్రస్తుతం ఈ శుభాకాంక్షల వ్యవహారం మరింత చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Save or share this story as a newspaper-style Epaper Clip:

