ఏజెన్సీ ప్రజలు ఆరోగ్యం కాపాడుకోవాలి : ఐటీడీఏ పీఓ
✍️ దివిటీ మీడియా – భద్రాచలం (మే 15)
భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో ఆదివాసీ మారుమూల గిరిజన గ్రామాలలోని గిరిజన కుటుంబాల సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకుని, ఆరోగ్యం పరిరక్షించు కోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో కోరారు. అస్వస్థతకు గురైతే వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్య చికిత్సలు చేయించుకోవాలని సూచించారు.
మే 16వ తేదీ గురువారం ‘జాతీయ డెంగ్యూ దినం’ సందర్భంగా ఆదివాసీ గిరిజన ప్రజలందరికి ఆయన సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని తమ వీధిలో కానీ ఇంటి పరిసరాలలో కానీ గుంతల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. కొబ్బరి చిప్పలలో, పాత టైర్లలో, నీటి తొట్లలో, రోళ్లలో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలని సూచించారు. అనుకోకుండా జ్వరం గానీ, ఏదైనా అస్వస్థతగానీ కలిగితే దగ్గరలో ఉన్న ఏఎన్ఎం, ఆశ కార్యకర్తను సంప్రదించాలని, వారు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తారని ఐటీడీఏ పీఓ ఈ సందర్భంగా తెలిపారు. వర్ష కాలం సమీస్తున్నందున ప్రతిఒక్కరూ అప్రమత్తం ఉంటూ తమ తమ కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడకుండా తమను తాము రక్షించుకోవాలని ఆయన కోరారు.