Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadLife StyleSpot NewsTechnologyTelangana

రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి

రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి

డీలర్ల సమావేశంలో జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల

✍️ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం (మే 8)

జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ సీజన్లో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ అధికారులు, డీలర్లను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ మీటింగ్ హాలులో రాబోయే వర్షాకాలం సీజనుకు సంబంధించి విత్తనాలు, ఎరువుల సరఫరాపై ప్రణాళిక తయారీకి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సాగువిస్తీర్ణం ఆధారంగా కావాల్సిన పత్తి, మొక్క జొన్న, మిర్చి విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. విత్తనాల కొరత లేకుండా చూడాలని, పత్తివిత్తనాలను ఎమ్మార్పీ ధర ప్యాకెట్ రూ.864లోపు మాత్రమే అమ్మాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలను అమ్మినట్లు తెలిస్తే సంబంధిత డీలర్లపై చట్టవరంగా చర్యలు తీసుకుంటామని జిల్లాకలెక్టర్ హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారులు నాణ్యమైన విత్తనాలను రైతులు సాగుచేసే విధంగా రైతువేదికలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రాబోయే వానాకాలంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నందున సాగు విస్తీర్ణం పెరుగుతుందని, దానికనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖాధికారులు, డీలర్లను ఆదేశించారు. జిల్లాలో పత్తి 2,16,625 ఎకరాలలో, మొక్కజొన్న 60,200 ఎకరాల్లో, మిరప 32,168 ఎకరాల్లో సాగుచేసే ప్రణాళిక ఉందని వివరించారు. దానికనుగుణంగా విత్తనాలతో పాటు ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. డీలర్లు రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు తప్పని సరిగా బిల్లు ఇవ్వాలని సూచించారు. రైతులు లూజు విత్తనాలను, గుడ్డ సంచుల్లో విత్తనాలను కొనుగోలు చేయరాదని కోరారు. వ్యవసాయశాఖ అధికారులు విత్తనాల నమూనాలను సేకరించి విశ్లేషణ ప్రకారం విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో ఉపాధిహామీ పథకంలో చెరువులలో పూడిక తీసిన మట్టిని పంటచేలకు వాడుకునేలాగా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖాధికారి బాబురావు, ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి సూర్యనారాయణ, సహకార శాఖాధికారి ఖుర్షీద్, పలువురు డివిజన్ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయాధికారులు, విత్తనాలు, ఎరువుల డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీకి సీఆర్పీఎఫ్ అభినందనలు

Divitimedia

పెహల్గాంలో ఉగ్రదాడిని ఖండించిన మస్జిదే దావత్

Divitimedia

ప్రజావసరాలకోసం భూసమస్యల పరిష్కారానికి భూసర్వే

Divitimedia

Leave a Comment