ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలి
ములకలపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ తనిఖీలు
✍️ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం (మే 7)
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెక్‌పోస్టుల్లో ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా.ప్రియాంకఅల ఆదేశించారు. మంగళవారం ములకలపల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పాల్వంచ-ములకలపల్లి మార్గంలో ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ టి చెక్ పోస్టును పరిశీలించిన కలెక్టర్, అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగా అమర్చ లేదని గుర్తించి వెంటనే సరి చేయాలని అధికారులను ఆదేశించారు. సుబ్బనపల్లిలోని మండల ప్రజా పరిషత్ స్కూలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, అక్కడ జరుగుతున్న అమ్మ ఆదర్శపాఠశాల పనులను తనిఖీ చేశారు. ఎలక్ట్రిసిటీ పనులు సరిగా లేవంటూ ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ ను మందలించారు. నిబంధనల ప్రకారం వెంటనే పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
జగన్నాథపురంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పోలింగ్ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను కూడా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలలో నీటి సౌకర్యం లేదని, టాయిలెట్లలో నీరు రావడంలేదని, అమ్మ ఆదర్శ పాఠశాల పనులు నత్త నడక సాగుతున్నాయని ట్రైబల్ వెల్ఫేర్ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పర్యవేక్షిస్తూ రెండు రోజుల్లో పూర్తిచేయాలని ఎంపీడీఓను ఆదేశించారు.
పాతగంగారం గ్రామపంచాయతీ వాగొడ్డుగుంపు గొత్తి కోయ ఆవాసంలో నివసిస్తున్న 22 కుటుంబాలకు చెందిన దాదాపు 100 మందికి సౌకర్యాలపై ఆరా తీశారు. పార్లమెంటు ఎన్నికల్లో వారందరూ విధిగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. సీతారాంపురం గ్రామపంచాయతీలోని సుబ్బనపల్లి ఆవాసంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పాతూరుచెరువు పూడికతీత పనిని కలెక్టర్ తనిఖీ చేసి కూలీల నుంచి వివరాలు తెలుసుకున్నారు. 13వ తేదీన తప్పనిసరిగా అందరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, మిషన్ భగీరథ ఈఈలు తిరుమలేష్, నళిని, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ స్వామి, ములకలపల్లి ఎంపీడీఓ భారతి, మిషన్ భగీరథ, ట్రైబల్ వెల్ఫేర్ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.