వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకోవాలి
✍️ దివిటీ మీడియా – విద్యావిధానం, ఏప్రిల్ 23
తెలంగాణలో ప్రభుత్వం ఈనెల 24వ తేది(బుధవారం) నుంచి జూన్ 11వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. సుమారుగా 45 రోజులకు పైగానే ఉన్న ఈ వ్యవధిని, ప్రతిరోజూ ఒక విషయం నేర్చుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని రచయిత, సైకాలజిస్ట్ డాక్టర్ ప్రభుదయాల్ విద్యార్థులకు సూచించారు. ఈ వేసవి సెలవులను విజ్ఞానాభివృద్ధికోసం సాధ్యమయ్యే రీతుల్లో సకల చర్యలు తీసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గడిచిపోయిన సమయం మరలా తిరిగి రాదని, విజ్ఞతతో సద్వినియోగం చేసుకునేవారు కచ్చితంగా రాణిస్తారని తెలిపారు. వేసవి సెలవుల సద్వినియోగం గురించి ఆయన అందజేస్తున్న విలువైన సూచనలు మీకోసం…
• రాత, పఠనం, శ్రవణ నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటూ చక్కని దస్తూరి(హ్యాండ్ రైటింగ్) కోసం రోజూ ప్రాక్టీస్ చేయాలి.
• సబ్జెక్టు విషయాలలో ఏఏ అంశాల్లో వెనకబడ్డాం అనే విషయాలను గ్రహిస్తూ, ఆయా అంశాల పట్ల పూర్తి పట్టు సాధించేలా స్వయంగా కృషి చేయాలి.
• భాషల్లో చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలో పట్టు సాధించేలా కృషి చేయాలి.
• చెడు తిరుగుళ్లకు, స్నేహాలకు, ఆలోచనలకు, పనులకు దూరంగా ఉంటూ, మంచి ఆలోచనలతో ముందుకెళ్లాలి.
• తల్లిదండ్రులకు, పెద్దలకు సహకారిగా ఉండి, వారిని విధిగా గౌరవించాలి.
• పై తరగతుల పాత పాఠ్యపుస్తకాలను సేకరించి ఆయా సబ్జెక్టుల పాఠ్యాంశాల పట్ల అవగాహన పెంచుకోవాలి.
• సబ్జెక్టు విషయాల్లో ఏవేని సందేహాలుంటే వెంటనే ఉపాధ్యాయులను సంప్రదిస్తూ నివృత్తి చేసుకోవాలి.
• వివిధ క్రీడల పట్ల ఆసక్తులు గలవారు సదరు క్రీడా సంఘాలను సంప్రదిస్తూ, వారు నిర్వహించే వేసవి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటూ, క్రీడా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి.
• మరీ ముఖ్యంగా, వాతావరణ సంస్థలు ఈసారి ఎండల తీవ్రత గురించి ముందే హెచ్చరికలు చేసినందున, ముందు జాగ్రత్తలు విధిగా పాటించాలి.
• పగటి వేళ సాధ్యమైనంత వరకు నీడ పట్టునే ఉండాలి.
• ఎక్కువగా మంచినీటిని సేవించాలి.
• ఎప్పటి పనులను అప్పటికప్పుడే నిర్వహించాలి. పెండింగులు సోమరితనాన్ని సూచిస్తాయి.
• వేపుళ్లు, మాంసాహారం, జంక్ ఫుడ్స్, కృత్రిమ శీతల పానీయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు.
• సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, సహజంగా లభించే మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి బోండాలు వంటివి తీసుకోవడం శ్రేయస్కరం.
• బయటకు వెళ్లాల్సి వస్తే, రుమాలు/టోపీలను ధరిస్తూ పల్చని కాటన్, లేత రంగుల దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
• చదువులో నైపుణ్యాలను మెరుగుపర్చుకునేలా స్వయంగా కృషి చేయాలి.