“అంగన్వాడీలో మురిగిపోయిన కోడిగుడ్లు”పై డీడబ్ల్యుఓ
దివిటీ మీడియా కథనంపై స్పందించిన డీడబ్ల్యుఓ
✍️ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 4
ఐసీడీఎస్ పాల్వంచ ప్రాజెక్టులో ‘మురిగిపోయిన కోడిగుడ్ల’ సరఫరా వ్యవహారంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత గురువారం విచారణ జరిపారు. “ఐసీడీఎస్ లో అక్రమార్కులదే ఇష్టారాజ్యం”, “అంగన్ వాడీలకు కుళ్లిపోయిన కోడిగుడ్లు సరఫరా” శీర్షికలతో “దివిటీ మీడియా”లో ప్రచురితమైన వార్తాకథనంపై స్పందించిన డీడబ్ల్యుఓ ఉల్వనూరు-3 అంగన్వాడీ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఖాళీ గా ఉన్న నేపథ్యంలో లక్ష్మిదేవిపల్లి అంగన్వాడీ టీచర్ ను ఇంచార్జిగా పెట్టారని గుర్తించారు. మురిగిపోయిన కోడిగుడ్లను ఎలా తీసుకున్నారని డీడబ్ల్యుఓ ప్రశ్నించి తెలుసుకున్నారు. టీచర్ లేకపోవడంతో ఆయా థంబ్ (వేలిముద్ర) వేసి తీసుకున్నదని, ఈ ఎండలకు గుడ్లు త్వరగా పాడయిపోతున్నాయని వారు తెలిపారు. ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన డీడబ్ల్యుఓ విజేత, టీచర్ థంబ్ వేయకుండా ఆయాతో వేయించడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రికార్డులు పరిశీలించి, సూపర్వైజర్ సందర్శన వివరాలు (విజిట్ ఎంట్రీలు) లేకపోవడంతో సూపెర్వైజర్ వసంతను తీవ్రంగా మంద లించారు. తక్షణమే సంజాయిషీ సమర్పించాలని ఆ సూపర్వైజర్, అంగన్వాడీ సెంటర్ టీచర్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సరైన వివరణ లేకపోతే జిల్లా ఉన్నతాధికారులకు నివేదించి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్కడ గర్భిణులు, బాలింతలతో మాట్లాడి అంగన్వాడీలో పోషణ సరిగ్గా నడుస్తుందా? లేదా? అని ఆరా తీశారు. ప్రతి రోజు ఆయా వండి పెడుతోందని, కాకపోతే టీచర్ ని మాత్రం నియమించాలని కోరారు. స్పందించిన సంక్షేమధికారి వచ్చే నోటిఫికేషన్లో ఉల్వనూరు-3 సెంటర్ కు టీచర్ ని తప్పకుండా నియమిస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచే కోడిగుడ్ల కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి తక్షణం మంచి గుడ్లను సరఫరా చేయాలని, ప్రస్తుతం. ఈ విషయమై సంజాయిషీ సమర్పించాలని ఆదేశించారు. మళ్ళీ ఇదే విధమైన సంఘటన పునరావృతమైనట్లయితే ఏజెన్సీ ని రాష్ట్రం మొత్తం బ్లాక్ లిస్టులో పెట్టేందుకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా నాసిరకం గుడ్లు వస్తే తక్షణమే వాటిని తిరస్కరించాలని, వెంటనే జిల్లా సంక్షేమధికారి కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు అంటేనే పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించేవి కాబట్టి సేవల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ రేవతి, సూపెర్వైజర్ వసంత, తదితరులు పాల్గొన్నారు.