ఎస్.సి.ఇ.ఆర్.టి విధులకు ఎంపికైన ఇందిరాప్రియదర్శిని
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సాధించిన ఏకైక ఉపాధ్యాయిని
✍ దివిటీ మీడియా – బూర్గంపాడు, మార్చి 17
రాష్ట్ర విద్యావిధానంలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తూ ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దే ప్రతిష్టాత్మక సంస్థ ‘ఎస్.సి.ఇ.ఆర్.టి’లో విధులకు ఎంపికయ్యారు బూర్గంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయిని చెట్ల ఇందిరాప్రియదర్శిని. అత్యున్నత ప్రమాణాలు కలిగిన వారినే ఎంపికచేసే ఈ ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేసేందుకు రాష్ట్రంలో 500మందికి పైగా పోటీపడగా, వారిలో కేవలం 28 మంది ప్రతిభావంతులనే ఎంపిక చేశారు. ఇంతటి పోటీలో ఎంపికైన వారిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి చెట్ల ఇందిరాప్రియదర్శిని ఒక్కరే ఉండటం విశేషం. గతనెల 11నుంచి 18వరకు నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో నిపుణుల కమిటీ ఇంటర్వ్యూలో ప్రతిభ చూపిన ఇందిరాప్రియదర్శిని, ఐ.సి.టి విభాగంలో ఎంపికయ్యారు. బూర్గంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న ఆమె 2021-22లో జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయినిగా అవార్డు కూడా అందుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఎస్.ఐ.ఇ.టి ద్వారా విద్యార్థులకు గణితంలో 15వరకు ఆన్ లైన్ క్లాసెస్ బోధించారు. కంప్యూటర్ సబ్జక్ట్ మీద ఉన్న మక్కువతో ఐఐటీ హైదరాబాదు, ఐఐటీ ముంబై, చెన్నై ల నుంచి సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేశారు. రాష్ట్రస్థాయిలో జరిగిన ఐ.సి.టి వర్క్ షాప్స్, ట్రైనింగ్స్ లో కూడా రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు. అంతేకాక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇందిరాప్రియదర్శిని, తన ప్రతిభతో ఎస్.సి.ఇ.ఆర్.టి సంస్థలో విధులు నిర్వర్తించేందుకు ఎంపికకావడం పట్ల బూర్గంపాడు ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రవీలాదేవి, సహోపాధ్యాయులు సునందిని, రామకృష్ణ, ఉమామహేశ్వరరావు, మంగయ్య, పలువురు యూనియన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరాప్రియదర్శినికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలతో ఘనంగా వీడ్కోలు పలికారు.