ఏం మారిందో ‘ఏలుతున్నవారే’ చెప్పాలి మరి…
నాడు అక్రమమన్నారు… నేడు అండగా నిలుస్తున్నారు…
సీఎం ఆదేశించినా ఇసుక అక్రమ రవాణా ఆగదా?
✍ కె.నాగిరెడ్డి, దివిటీ మీడియా, మార్చి 5
“ఇసుకదొంగలను తరిమికొట్టండి… మేం మంచిగా పరిపాలన చేస్తాం…” అంటూ మాటలు చెప్పి మరీ ఓట్లేయించుకున్న అధికారపార్టీ నేతలకూ ఇప్పుడు ఇసుక అక్రమ రవాణా అసలు కనిపించడంలేదు. నాడు ఇసుక మాఫియాను తరిమికొట్టండంటూ పిలుపునిచ్చినవారే నేడు తమవంతు ప్రోత్సాహం అందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బూర్గంపాడు మండలంలో ప్రస్తుతం ఇసుక అక్రమ రవాణా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని తాళ్లగొమ్మూరు, సారపాక, మోతె ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నవారి ‘దందాకు’ అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఎంత ఘోరంగా మారిందంటే యధేచ్ఛగా యంత్రాలతోనే లారీల్లో దర్జాగా అక్రమరవాణా చేసుకుంటున్నారు. ప్రస్తుత బూర్గంపాడు తహసిల్దారు ముజాహిద్ ఈ మండలంలో బాధ్యతలు చేపట్టిన ఆరంభంలో తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రయత్నం చేశారు. మూడురోజుల పాటు అధికారులు, సిబ్బంది రాత్రివేళ కాపలా కాసి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూశారు. ఇదే నేపథ్యంలో తహసిల్దారు ముజాహిద్ అకస్మాత్తుగా బదిలీ అయ్యారు. ఎన్నికలకు ముందు తప్పనిసరి బదిలీల్లో భాగంగా బూర్గంపాడు తహసిల్దారుగా వచ్చిన ముజాహిద్, కేవలం 11రోజుల్లోనే ఇక్కడ నుంచి బదిలీ కావడం గమనార్హం. ఆ తర్వాత మళ్లీ ఇక్కడికే వచ్చిన ఆయన ఇసుక అక్రమ రవాణా గురించి మాత్రం తనకేమీ తెలియనట్లు, అసలు ఈ అక్రమరవాణా జరగనట్లు ఉండిపోయారు. ఓవైపు ఇసుక అక్రమ రవాణా నిరోధించాలని కిందిస్థాయి అధికారులకు ‘హితబోధలు’ చేస్తూ ప్రకటనలిస్తున్న జిల్లా ఉన్నతాధికారులే రాజకీయ వత్తిడులకు గానీ మరేదైనా ప్రలోభాలకు గానీ లొంగిపోయి చర్యలు తీసుకుంటున్నారా? అనే సందేహాలు తలెత్తాయి. బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టిన 11 రోజుల్లోనే తిరిగి తహసిల్దారును బదిలీ చేయడం ఏ ఎన్నికల నిబంధనల ప్రకారమో ఉన్నతాధికారులకే ఎరుక. నానాతంటాలు పడి తిరిగి ఇక్కడే పోస్టింగ్ ఆర్డర్ తెచ్చుకున్న తహసిల్దారు, ప్రస్తుతం ఇసుక అక్రమ రవాణా అనేదే జరగనట్లు ఉండిపోతున్నారు. ఈ వ్యవహారం మొత్తం పరిశీలిస్తే ఉన్నతాధికారులు కూడా వత్తిడులకు లొంగిపోయి కిందిస్థాయిలో పని చేసే అధికారుల ‘ఆత్మస్థైర్యం దెబ్బతీసే’ చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పెద్ద ఆదాయవనరుగా మారిన ఇసుక అక్రమ రవాణానే తమ వృత్తిగా మార్చుకుని చెలరేగిపోతున్న ఇసుక అక్రమార్కులకు నాడు నేడు కూడా అధికారపార్టీ నేతల మద్దతు లభిస్తోందన్న విషయం మరోసారి నిరూపితమైంది. తమ దందా కోసం పార్టీ మార్చేసి మరీ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిసినా కూడా అధికారపార్టీ నేతలు మద్దతునిస్తున్నారంటే ఇంతకంటే దిగజారుడు మరేమీ ఉండదనే విమర్శ వస్తోంది. ఒకవేళ ఇసుక అక్రమార్కులకు తామేమీ మద్దతు ఇవ్వడం లేదంటే అక్రమ రవాణా నిరోధం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులపై వత్తిడి తీసుకురావడం తప్పనిసరి. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, ఎక్కడా అక్రమ రవాణా జరగడానికి వీలులేదంటూ ఇస్తున్న ఆదేశాలకు విలువనివ్వాలి. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకు కూడా విలువ లేకుండా చేస్తున్నారంటే మాత్రం ఎంతగా దిగజారారో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో బూర్గంపాడు మండల అధికారులు, అధికారపార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తారనేది త్వరలో వస్తున్న పార్లమెంటు ఎన్నికల్లో అధికారపార్టీపై ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.