సమాచార హక్కు చట్టం… బోర్డులోనే కనపడుతోంది నిర్లక్ష్యం
బూర్గంపాడు తహశిల్ నుంచి సమాచారం రావడం గగనం…
✍ దివిటీ మీడియా – బూర్గంపాడు, మార్చి 5
సమాచార హక్కు చట్టం-2005 అమలులో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించేదిగా పేరున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల తహసిల్దారు కార్యాలయంలో కనిపిస్తున్న బోర్డు ఇది… పారదర్శకత, జవాబుదారీతనానికి దారి చూపించే ఈ చట్టం అమలు పరిచే అధికారుల వివరాలు అందరికీ తెలిసేలా ప్రభుత్వానికి చెందిన ప్రతి కార్యాలయంలో ఈ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం ప్రతి పౌరుడు ఈ చట్టం ఉపయోగించుకుని ప్రభుత్వం నుంచి సమాచారం పొందవచ్చు. అందుకే ఈ చట్ట ప్రకారం సమాచారం అందించే బాధ్యులైన సిబ్బంది వివరాలు ఇలా బోర్డులపై ప్రతి కార్యాలయంలోనూ ప్రదర్శించాలనేది ప్రాథమిక నిబంధన. తద్వారా ఈ చట్టాన్ని అందరూ ఉపయోగించుకునేలా చేయడం అసలు లక్ష్యం. ఇంత ప్రాధాన్యం కలిగిన సమాచార హక్కు చట్టం-2005 బోర్డు బూర్గంపాడు మండలం తహసిల్దారు కార్యాలయంలో ముందు భాగంలోని గోడపై ఈ విధంగా కేవలం అరకొర సమాచారంతో దర్శనమిస్తోంది. ఆ బోర్డులో ప్రదర్శించిన సహాయ సమాచార అధికారి ఫోన్ నెంబరు అర్థం కాకుండా ఉంది. దీనికితోడు సమాచార అధికారి నెంబరు రాయలేదు. ఓ కాగితం మీద రాసిన అప్పిలేట్ అధికారి పేరు కనిపించడంలేదు. అదేవిధంగా ఈ బోర్డు మీద ప్రదర్శించిన ఆఫీసు నెంబరు కూడా పనిచేయడం లేదు. గతంలో ఎంతోమంది తమకు అవసరమైన సమాచారం కోసం దరఖాస్తు చేసినా ఏమాత్రం స్పందించకపోవడం ఈ కార్యాలయంలో ప్రత్యేకత. ఈ బోర్డు దుస్థితి ఈ కార్యాలయంలోని పరిస్థితులకు అద్దం పడుతోందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ బోర్డును స్పష్టంగా అన్ని సక్రమ వివరాలతో ఏర్పాటు చేయాలని, దరఖాస్తు చేసిన వారికి తప్పక సమాచారం కూడా అందించాలని సమాచార హక్కు చట్టం-2005 కార్యకర్తలతోపాటు దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఈ అంశంపై బూర్గంపాడు తహసిల్దారు కార్యాలయ పౌరసమాచార అధికారి, డిప్యూటీ తహసిల్దారు రాంనరేష్ ‘దివిటీ మీడియా’తో మాట్లాడుతూ, గతంలో జరిగిన విషయాలు తనకు తెలియదన్నారు. ఇప్పుడు దరఖాస్తుదారులకు తగిన విధంగా స్పందిస్తున్నామని వివరించారు.