అరకొర జీతం… అర్థరాత్రి కూడా తప్పని పనిభారం…
జిల్లాలో ఐకేపీ వీఓఏల ‘ఆన్ లైన్’ కష్టాలు
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 3
వారికి ఇచ్చేది నెలకు రూ.5,000 గౌరవ వేతనం… ఆ గౌరవ వేతనం కోసం వేళాపాళా లేకుండా పనిచేస్తున్న మహిళా వీఓఏల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారింది. తమకిచ్చే గౌరవవేతనానికి తగ్గట్లుగా వారంతా పార్ట్ టైం పనిచేస్తున్నారనుకుంటే పొరపాటే… నిత్యం తమ పరిధిలో ఉన్న డ్వాక్రా మహిళా సంఘాలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సేవలందిస్తున్న వీఓఏలకు తాజాగా కొత్తకష్టం వచ్చిపడింది. కుటుంబాలకు దూరంగా అర్థరాత్రి వరకు పని చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఈ దుస్థితి వందలాది మంది వీఓఏలు ఎదుర్కొంటున్నారు. ములకలపల్లి మండలంలోని వీఓఏల ఆవేదన వారి కష్టాలకు అద్దం పడుతోంది…
గ్రామంలో తమ పరిధిలోని డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించిన అంశాల్లో సాయం చేసేందుకు ఆరంభంలో ప్రభుత్వం గ్రామదీపికల(బుక్ కీపర్లు) వ్యవస్థ ఏర్పాటు చేసింది. 10 నుంచి 20 డ్వాక్రా సంఘాలుండే గ్రామ సమాఖ్య పరిధిలో సమావేశాలు నిర్వహిస్తూ, తీర్మానాల వంటివి రాయడం, ప్రభుత్వ పథకాలు మహిళలకు చేరవేయడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళలు భాగస్వాములయ్యేలా చూడటం వంటి పనులు చేసేవారు. ఈ వ్యవహారాలు సంక్లిష్టంగా మారి పనిభారం పెరగడంతో గ్రామదీపికలు పోరాటాలు, ఉద్యమాలు చేయడంతో ప్రత్యేక గుర్తింపు, గౌరవవేతనం నిర్ణయించారు. వీఓఏలు (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్)గా మార్చిన ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాలకు సేవలతో పాటు ఇతర కార్యక్రమాల్లో కూడా వీరి సేవలు తీసుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల కొత్తగా ‘లోకాస్ యాప్’ అనే యాప్ ద్వారా డ్వాక్రా మహిళాసంఘాల వివరాలు పూర్తిగా ఆన్ లైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసలే పని భారంతో తక్కువ గౌరవవేతనంతో పనిచేస్తున్న వీఓఏలకు ఈ ఆన్ లైన్ వ్యవహారం తలకు మించిన భారంగా మారి పోయింది. ఇంటర్నెట్, ఇతర సాంకేతిక సమస్యల వల్ల ఈ వివరాలు ఆన్ లైన్ చేసేందుకు రోజంతా పనిచేస్తున్నా ఈ పని కావడంలేదు. దీనికి తోడు వీఓఏలకు పూర్తి స్థాయిలో ఈ పరిఙ్ఞానం లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఆన్ లైన్ నమోదులో వెనుకబడిపోయిన మండలాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఉన్నతాధికారుల వత్తిడితో ఐకేపీ అధికారులు, ఉద్యోగులు వీఓఏలతో రాత్రివేళల్లో మండల కార్యాలయానికి రప్పించి పని చేయిస్తున్నారు. ప్రస్తుతం ములకలపల్లి మండలంలో ఇరవైరోజుల నుంచి వీఓఏలను మండల కార్యాలయానికి రప్పించి రాత్రి 10గంటల వరకు ఈ ఆన్ లైన్ పనులు చేయిస్తుండటం వివాదంగా మారింది. తమతో పగటిపూట పనివేళలకు మించి రాత్రివేళ దాదాపు అర్థరాత్రి వరకు పనిచేయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అటు కుటుంబ అవసరాలు తీర్చలేక, ఇటు ప్రశాంతంగా తమ పని పూర్తి చేయలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విలవెలా వేలకువేల రూపాయలు జీతాలు తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులందరూ సాయంత్రం 5గంటలకు విధుల నుంచి ఇళ్లకు వెళ్లిపోతారు. అలాంటిది కేవలం రూ.5,000 గౌరవవేతనం(అందులోనూ ప్రభుత్వం ఇచ్చేది రూ.3000 మాత్రమే) తీసుకునే డ్వాక్రా వేఓఏలు మాత్రం రాత్రివేళల్లో పనిచేయాల్సి వస్తోంది. అన్ని డ్వాక్రా సంఘాల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాల్సిన యాప్ సక్రమంగా పనిచేయకపోవడం, సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ములకలపల్లి మండలంలోని ఐకేపీ వీఓఏలకు సీపీఐ నాయకుడు నరాటి ప్రసాద్ మద్దతు పలికారు. రాత్రి వేళ ఇబ్బందులు పడుతూ మహిళలు (వీఓఏలు) ఆన్ లైన్ పనులు చేసుకోవాల్సిన దుస్థితి తొలగించేందుకు ఐకేపీ అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్ లైన్ లో వివరాల నమోదులో సాంకేతిక సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, వీఓఏల మీద వేళాపాళా లేని పనిభారం తగ్గించేందుకు కూడా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.