అభివృద్ధి పనులకు, అటవీ అభ్యంతరాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష
✍🏽 దివిటీ – కొత్తగూడెం (జనవరి 17)
ప్రజావసరాల కోసం చేపట్టిన పనులు జాప్యం చేయకుండా త్వరగా పూర్తిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశమందిరంలో ఆమె రెవెన్యూ, అటవీ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, వ్యవసాయ, మిషన్ భగీరథ, విద్యుత్తు శాఖలు, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. పెండింగులో ఉన్న పనులపై శాఖలవారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల మాట్లాడుతూ, రోడ్లు, విద్యుత్తుసౌకర్యం, గిరివికాసం బోర్లు, తదితర పనులకు జిల్లాస్థాయి కమిటీ ఆమోదించినట్లు చెప్పారు. సంబంధిత అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు అంతరాయం కల్పించవద్దని అటవీ అధికారులకు సూచించారు. ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన పనులు చేపట్టే ముందు ఆయా శాఖల అధికారులు, అటవీశాఖాధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని చెప్పారు. ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం వల్ల పనులు సకాలంలో పూర్తి చేసే అవకాశముంటుందని చెప్పారు. ఏదైనా సమస్య వస్తే తక్షణమే తన దృష్టికి తేవాలని, పనులు పెండింగ్ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు. ఎలాంటి అంతరాయం లేకుండా పనులు జరగాలని చెప్పారు. పీసీసీఎఫ్ వద్ద పెండింగ్ ఉన్న అనుమతులపై నివేదికలు, వివరాలు అందజేయాలని ఆమె ఆదేశించారు. జూలూరుపాడు, లక్ష్మిదేవిపల్లి మండలాల్లో గిరివికాసం క్రింద మంజూరు చేసిన బోరుబావులకు విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు పనులు తక్షణం చేపట్టాలని విద్యుత్తు శాఖాధికారులకు సూచించారు. సబ్ స్టేషన్ల నిర్మాణం కోసం అనుమతులు మంజూరు చేసిన మండలాల్లో తక్షణం భూకేటాయింపులు చేయాలని తహసిల్దారులను ఆదేశించారు. బోరుబావులు వేసేందుకు అటవీశాఖ అనుమతులు లేకపోవడం వల్ల మంచినీటి సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించిన గ్రామ పంచాయతీల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. మారుమూల గ్రామాల ప్రజలకు సెల్ ఫోన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు టవర్ల నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్డీఓలకు సూచించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమకార్యక్రమాలకు అవసరమైన అటవీభూముల అనుమతులకు ప్రతిపాదనలు ఐటీడీఏకు పంపాలని చెప్పారు. అటవీభూముల్లో పనులు చేపట్టేందుకు తప్పనిసరిగా జిల్లాస్థాయి కమిటీలో ఆమోదించాల్సి ఉంటుందన్నారు. చేపట్టనున్న పనులకు సంబందించి అటవీశాఖ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలన చేయాలని చెప్పారు. కొత్త పనులు చేపట్టేందుకు జిల్లాస్థాయి కమిటీకి ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. పోడు పట్టాలున్న గిరిజన రైతులు పామాయిల్ సాగుకు బోరు బావులు, విద్యుత్తు సౌకర్యం కల్పనకు అటవీ, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి కిష్టాగౌడ్, అదనపు కలెక్టర్లు డాక్టర్ రాంబాబు, మధుసూదన్ రాజు, ఆర్ అండ్ బి ఈఈ భీంలా, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, డీపీఓ రమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.