వాడవాడలా ప్రజాపాలనలో అభయహస్తం దరఖాస్తుల వెల్లువ
పలుచోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు
✍🏽 దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (డిసెంబర్ 28)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం నిర్వహించిన ‘ప్రజాపాలన’ గ్రామసభలలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఆరు గ్యారెంటీల సంక్షేమ పథకాల అమలు కోసం దరఖాస్తులు తీసుకునేందుకు నిర్వహిస్తున్న గ్రామసభలలో మొదటిరోజు పెద్దసంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు. ఆరురోజుల పాటు దరఖాస్తులు స్వీకరించే విధంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో తొలిరోజే దరఖాస్తులు సమర్పించేందుకు ప్రజలు బారులు తీరారు.
మణుగూరు మండలం బుగ్గ పంచాయితీలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, డీఎస్పీ రాఘవేంద్రరావు, ఇతర అధికారులు దరఖాస్తులు స్వీకరించి లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణపురం ఒకటవ వార్డులో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి, ఆర్డీఓ శిరీష, మున్సిపల్ కమిషనర్ రఘు, డీఎస్పీ రెహమాన్, తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఆర్డీఓ మంగీలాల్, తదితరులు పాల్గొన్నారు. భద్రాచలంలో ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దరఖాస్తులు, జిరాక్స్ కాపీల కోసం అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠినచర్యలు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అశ్వాపురం మండలం అమెర్దా గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో రెవెన్యూ అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. చుంచుపల్లి మండలంలోని వెంకటేశ్వర కాలనీ గ్రామంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఎంపిపి బదావత్ శాంతి, అధికారులు పాల్గొన్నారు.
——————–
ప్రజాపాలన గ్రామసభను పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
———————
పాల్వంచ పట్టణం గాంధీనగర్లో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను గురువారం జిల్లా ఎస్పీ డా.వినీత్, అధికారులు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 23 మండలాల్లోని 83 గ్రామాల్లో, 23 మున్సిపాలిటీ వార్డుల్లోని మొత్తం 106 కేంద్రాల్లో గురువారం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డా.వినీత్ ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం 25087 దరఖాస్తులను సంబంధిత అధికారులు స్వీకరించారని, జనవరి 6వ తేదీ వరకు జరిగే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్ద ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసుశాఖ తరపున అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.