విజయ రథసారథులు విచ్చేస్తున్న వేళ…
మంత్రుల హోదాలో తొలిసారి జిల్లాకు… భారీగా స్వాగత ఏర్పాట్లు
✍🏽 దివిటీ మీడియా – ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్రంలో అద్భుత విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రుల హోదాలో ఉమ్మడి జిల్లా నేతలు ఆదివారం తొలిసారి పర్యటిస్తుండటంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏకంగా ముగ్గురు సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారు అద్భుతమైన విజయాలు సాధించడంతోపాటు ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆదివారం తొలిసారి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉమ్మడి జిల్లా సరిహద్దు ప్రాంతమైన కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ముగ్గురు మంత్రులకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటలకు నాయకన్ గూడెం చేరుకుని, అక్కడ నుంచి 10గంటలకు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ‘సంజీవరెడ్డి భవన్’ లో కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పాల్వంచ సుగుణ గార్డెన్స్ లో జరుగనున్న విజేతల సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం 4గంటలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుంటారు. ముగ్గురు మంత్రుల పర్యటన కోసం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్ ఛార్జ్ దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో కోరారు.