ఎన్నికల వేళ మావోయిస్టుల కలకలం…
చర్లలో ధాన్యం లారీ దగ్ధం చేసిన నక్సలైట్లు
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు రెండు రోజుల ముందు మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కలకలం సృష్టించారు. మంగళవారం ధాన్యం లోడుతో చర్ల మండల కేంద్రానికి వస్తున్న ఓ లారీని దగ్ధం చేశారు. స్థానికుల కథనం ప్రకారం… చర్ల మండలం వద్దిపేట నుంచి పూసుగుప్పకు వెళ్లే ప్రధాన రహదారిపై మావోయిస్టులు ఈ సంఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ లారీ (నెంబర్ AP 37 TB 6568) ధాన్యం లోడుతో చర్ల వైపునకు వస్తున్న క్రమంలోనే అటకాయించిన మావోయిస్టులు, దానిని తగులపెట్టారని చెప్తున్నారు. ఆ లారీ చర్ల మండలానికి చెందిన వ్యక్తిదని తెలుస్తోంది. రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో ఈ సంఘటనకు పాల్పడిన మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసిరినట్లయింది. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీస్ ఉన్నతాధికారులు, కేంద్ర, రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలను భారీగా మోహరించి కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల వేళ అలజడికి కారణమవుతున్న సంఘటన జరగడంతో పోలీస్ అధికారులు మరింత అలర్టయ్యారు. మరింత జాగ్రత్తలు తీసుకుంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు సమాచారం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.