నవంబరు 10న ఉమ్మడి జిల్లా పాఠశాలల బాక్సింగ్, సాఫ్ట్ బాల్ ఎంపికలు
✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం
ఉమ్మడి ఖమ్మంజిల్లా స్థాయిలో అండర్-14, అండర్-17 బాలబాలికల బాక్సింగ్ క్రీడా ఎంపికలు నవంబర్ 10వ తేదీ, కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో, సాఫ్ట్ బాల్ ఎంపికలు రామవరం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించనున్నారని ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరాచారి ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బాక్సింగ్, సాఫ్ట్ బాల్ క్రీడల ఎంపికలలో పాల్గొనాలనుకునే ఆసక్తికలిగిన క్రీడాకారులు 10వ తేదీ ఉదయం 9 గంటల లోపు కొత్తగూడెం, రామవరంలలో నిర్దేశిత స్థానాలలో హాజరుకావాలని వారు కోరారు. పోటీల్లో పాల్గొనే అండర్-17 క్రీడాకారులు ఈ విద్యాసంవత్సరంలో 6వ తరగతి నుంచి ఇంటర్ ఫస్టియర్ లోపు చదువుతూ, 2007 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వారై ఉండాలని తెలిపారు. 9,10వ తరగతిలో చదువుతున్నవారైతే ప్రధానోపాధ్యాయుల నుంచి స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలని సూచించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నవారు తమ 10వ తరగతి ఇంటర్నెట్ మెమో డౌన్లోడ్ చేసుకుని ప్రిన్సిపాల్ చేత సంతకం చేయించుకుని, ఆ కళాశాల బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని హాజరు కావాలని తెలిపారు. అండర్-14 క్రీడాకారులు 6వ తరగతినుంచి 9వతరగతిలోపు చదువుతున్నవారై, 2010 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. పై పేర్కొన్న ధ్రువపత్రాలు తీసుకుని రానివారిని ఎలాంటి పరిస్థితుల్లోను ఈ ఎంపికల్లో పాల్గొనేందుకు అనుమతించబడరని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పాఠశాలల క్రీడా కార్యదర్శులు నర్సింహామూర్తి, స్టెల్లా ప్రేమ్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఉమ్మడి జిల్లాలోని పీఈటీలు, పీడీలందరూ ఈ నియమనిబంధనలను పాటిస్తూ, తమ క్రీడాకారులు హాజరయ్యేలా చూడాలని కోరారు.