సి-విజిల్ యాప్, ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్. ప్రియాంకఅల
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
ఓటింగ్ శాతం పెంచే విధంగా అవగాహన కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల ఆదేశాలు జారీచేశారు. ఐడీఓసీ సమావేశమందిరంలో మంగళవారం స్వీప్ కార్యక్రమాల నిర్వహణ పై రెవిన్యూ, డీఆర్డీఓ, విద్యా, పంచాయతీ, ఇంటర్మీడియట్, తదితరశాఖల అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతఎన్నికల్లో జిల్లాలో 166 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తక్కువగా జరిగినట్లు గుర్తించామని వెల్లడించారు. ఆ పోలింగ్ కేంద్రాల్లో ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కళాజాతా ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీపీఆర్ఓను ఆమె ఆదేశించారు. మెప్మా, ఐకేపీ మహిళా స్వయం సహాయక సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పరిశ్రమల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు అవగాహన కల్పించేలా చూడాలన్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించే విధంగా విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రధాన కూడళ్లలో అవగాహనకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలకోడ్ ఉల్లంఘనలు, అవినీతి కార్యకలాపాలు, ఓటర్లను ప్రలోభ పెట్టే ఎలాంటి చర్యలనైనా సి-విజిల్ యాప్ ద్వారా పిర్యాదులు చేయడంపైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ యాప్ ద్వారా కేవలం 100 నిమిషాలలో పిర్యాదు దారునికి పరిష్కారం అందించబడుతుందని చెప్పారు. పిర్యాదు చేసిన 5నిమిషాల్లోపునే జిల్లా ఎన్నికలఅధికారి కార్యాలయం నుంచి సంబంధిత ఫ్లైయింగ్ స్క్వాడ్ టీముకు దాని సమాచారం అందుతుందని, 15 నిమిషాల్లో ఆ ప్లైయింగ్ స్క్వాడ్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకుని తర్వాత 30 నిమిషాల్లో ఏటీఆర్ నివేదిక రిటర్నింగ్ అధికారికి అందజేస్తారని చెప్పారు. రిటర్నింగ్ అధికారి ఆధారాలను పరిశీలించిన తర్వాత 40 నిమిషాల్లోపే ఆ ఫిర్యాదుకు సంబంధించి తీసుకున్న చర్యల వివరాలు సి-విజిల్ యాప్ లో నమోదుచేసి పరిష్కరిస్తారని చెప్పారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్లు వారి పోలింగ్ బూత్ సమాచారం, ఓటర్ గుర్తింపుకార్డులో చేసిన మార్పు, పోటీ చేసే అభ్యర్థుల వివరాలు, ఫలితాలు, తదితర అంశాలను ఆ యాప్ ద్వారా పొందవచ్చని తెలిపారు. రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు ఏమైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, వాహనాల ద్వారా ప్రచారం, ఎన్నికల కార్యాలయాల ఏర్పాటు, మైకు, డీజే ఏర్పాటు, హెలికాప్టర్స్, హెలి ప్యాడ్ తదితర అనుమతులకు 48 గంటల ముందుగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి గానీ జిల్లా ఎన్నికల అధికారికి గానీ సువిధ క్యాండిడేట్ యాప్ లో, సువిద వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. సంబంధిత రిటర్నింగ్ అధికారి గానీ, జిల్లా ఎన్నికల అధికారి గానీ వారి అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసు, రవాణా, అగ్నిమాపక శాఖల అధికారులకు సిఫారసు చేసి, నోఅబ్జక్షన్ సర్టిఫికెట్లు పొంది తర్వాత ఆన్ లైన్ లో అనుమతులు జారీ చేస్తారని వివరించారు. ఎన్నికలసంఘం ఆ ఐటీ(మొబైల్) అప్లికేషన్ దరఖాస్తులను ఈ సారి ఎన్నికలనిర్వహణలో భాగం చేయడం ద్వారా ప్రజలు, రాజకీయపార్టీలకు వ్యయ, ప్రయాసలను తగ్గిస్తుందని చెప్పారు. సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఈ సమావేశంలో డీఆర్డీఓ మధుసూదన్ రాజు, స్వీప్ నోడల్ అధికారి త్రినాధ్ బాబు, పంచాయతీ అధికారి రమాకాంత్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి, ఇంటర్మీడియట్ అధికారి సులోచనారాణి, యువజన క్రీడల అధికారి పరంధామరెడ్డి, డీపీఆర్ఓ శ్రీనివాస్, తహసిల్దార్లు, ఎంపీడీఓ లు, తదితరులు పాల్గొన్నారు.