దేశ ఐక్యతకు పాటుపడిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్
ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
స్వాతంత్య్రనంతరం సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయడానికి కృషిచేయడం ద్వారా జాతీయ సమైక్యతకు పాటుపడిన మహనీయుడు సర్దార్ వల్లబాయ్ పటేల్ అని కలెక్టర్ డా.ప్రియాంకఅల, భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ కొనియాడారు. ఈ మేరకు మంగళవారం సర్దార్ జయంతిని పురస్కరించుకుని ఐడీఓసీ కార్యాలయం, ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ‘ఏక్తా దివస్’ కార్యక్రమాల్లో వారు వేర్వేరుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా కలెక్టర్, పీఓ మాట్లాడుతూ, హైదరాబాద్, జునాగడ్ లాంటి సంస్థానాలు భారతదేశంలో విలీనం చేసిన ఘనత పటేల్ సొంతమన్నారు. ఇంగ్లండులో బారిష్టర్ పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన దేశంలో జరుగుతున్న జాతీయ ఉద్యమానికి ఆకర్షితులై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నారని తెలిపారు. విభజన తర్వాత దేశంలో అనేక ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేసిన ఘనత ఆయనదన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా, భారత ప్రథమ హోంశాఖమంత్రిగా ప్రజలకు అమూల్యమైన సేవలందించారని దివంగత పటేల్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో ‘ఏక్తాదివస్ ప్రతిజ్ఞ’ చేయించారు. మరోవైపు జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈఓ విద్యాలత, సిబ్బంది పటేల్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించి, ప్రతిఙ్ఞ చేశారు. ఐడీఓసీలో కార్యక్రమంలో డీఆర్డీఓ మధుసూధన్ రాజు, డీపీఓ రమాకాంత్, డీఎం సివిల్ సప్లై త్రినాథ్ బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి, ఇంటర్మీడియట్ అధికారి సులోచనారాణి, డీఎస్ఓ రుక్మిణిదేవి, తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఐటీడీఏలో జరిగిన కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, ఏఓ భీమ్, ఏడీ అగ్రికల్చర్ ఉదయభాస్కర్, మేనేజర్ ఆదినారాయణ, జీసీసీ డివిజనల్ మేనేజర్ విజయకుమార్, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.