టీడీపీలో ముసలం, రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంక టీడీపీ బరిలో లేనట్లే…
బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా టీడీపీ క్యాడర్
✍🏽 కె.ఎన్.ఆర్ – దివిటీ మీడియా
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అధినాయకత్వం అంగీకరించకపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన పరిణామంగా దీనిని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం వేగంగానే చోటు చేసుకున్న పరిణామాల వల్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పూర్తి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే కేంద్రీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణలో అరకొర స్థానాల్లో విజయం సాధించిన టీడీపీ, ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణలో పార్టీ క్రమ క్రమంగా బలహీన పడుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 తర్వాత అధికారంలో ఉన్న టీడీపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ‘ఓటుకు నోటు కేసు’ కారణంగా ఇబ్బందులు పడటంవల్ల వేగంగా మసకబారిపోయిందనే అభిప్రాయం ఉంది. ఆ పరిస్థితుల్లో జాతీయ పార్టీ హోదా కోసం టీడీపీ అధినాయకత్వం చేసిన ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణలో కూడా ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు ఎల్.రమణ నిష్క్రమణ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ పగ్గాలను చేపట్టారు. అడపాదడపా కార్యక్రమాలతో ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చిన టీడీపీ తెలంగాణ నాయకులు, ఈ అసెంబ్లీఎన్నికల్లో బలం చాటిచెప్పుకోవాలని ఉవ్విళ్లూరుతూ వచ్చారు.
తెలంగాణలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 40 స్థానాలకు పైగానే పోటీ చేసేందుకు కూడా కార్యకర్తలు సంసిద్ధులయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న తీవ్ర రాజకీయపరిణామాల్లో ఏకంగా చంద్రబాబు కష్టాలలో పడ్డారు. ‘స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్’ లో కుంభకోణం జరిగిందని, దాంట్లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు పాత్ర ఉందనే అభియోగాలతో ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 50రోజులనుంచి బాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండటం, ఆ కేసునుంచి బయటపడేందుకు ఆయన ఓ వైపు ప్రయత్నాలు చేస్తుండగానే మరోవైపు కొత్తగా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం టీడీపీ అధినాయకత్వానికి కష్టంగా మారింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలని ఆ పార్టీ క్యాడర్ కోరుతుండగా, తెలంగాణలో పోటీ చేయవద్దని చంద్రబాబునాయుడు చెప్పడం వల్ల ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు నిర్ణయం నచ్చలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన కాసాని జ్ఞానేశ్వర్, అధ్యక్ష పదవితోపాటు పార్టీకి కూడా రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా బరిలో దిగాలనే టీడీపీ క్యాడర్, తీవ్రంగానే నిరాశ చెందుతోంది. పార్టీకి సాంప్రదాయంగా కొనసాగుతున్న ఓటుబ్యాంకు కూడా చెల్లా చెదురవుతుందనే భయం టీడీపీలో రోజు రోజుకూ పెరుగుతోంది. రాజకీయంగా తమ ఉనికి చాటుకుంటూ, బలప్రదర్శన చేసేలా ఎన్నికల రూపంలో అందివచ్చిన అవకాశం చేజారిపోతుండటంతో తెలంగాణ టీడీపీలో పెరుగుతున్న అసంతృప్తి, ఆ పార్టీ క్యాడర్ ఇతర పార్టీల వైపు చూసేందుకు కారణంగా మారుతోంది. చంద్రబాబునాయుడు అరెస్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఆగ్రహంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి వ్యతిరేకంగా తమ సత్తా చూపిస్తామని శపథం చేశారు. టీడీపీ క్యాడర్, ఓటుబ్యాంకు తెలంగాణలో హైదరాబాదుతోపాటు ఉమ్మడి ఖమ్మంజిల్లా వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అదనంగా బలం చేకూర్చే పరిస్థితి కనిపిస్తోంది.

