తెలంగాణ ఎన్నికల్లో అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయం
మూడు రాష్ట్రాల ఎక్సైజ్ అధికారుల సమన్వయ సమావేశం
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణలోనికి అక్రమరవాణా నిరోధానికి చర్యలు తీసుకోవాలని మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల అధికారులు నిర్ణయించారు. గురువారం సారపాకలోని ఐటీసీ పీఎస్ పీడీ అతిథిగృహంలో మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కొత్తగూడెం జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి జానయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉమ్మడిఖమ్మం జిల్లా అబ్కారీ డిప్యూటీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోనికి పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ల ఎక్సైజ్ అధికారుల సహకారంతో మద్యం, నాటుసారా, గంజాయి, మత్తు పదార్థాలు దిగుమతి కాకుండా చర్యలు తీసుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తాత్కాలిక బోర్డర్ చెక్ పోస్ట్ ల ఏర్పాటుతో పాటు ఇప్పటికే పనిచేస్తున్న చెక్ పోస్టులను బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాల అధికారులతో కలిసి సరిహద్దు ప్రాంతాలలో ఉమ్మడిగా దాడులు నిర్వహించి ఎక్సైజ్ నేరాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గణేష్ , సుక్మా జిల్లా ఎక్సైజ్ అధికారి గజేందర్, కొత్తగూడెం జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కరంచంద్, భద్రాచలం, పాల్వంచ ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు రహీమున్నిసాబేగం, గురునాథ్ రాథోడ్, జంగారెడ్డిగూడెం, చింతూరు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు శ్రీనివాసరావు, వంశీకృష్ణ, కుంట స్టేషన్ హౌస్ ఆఫీసర్ సమర్థ్, కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ నాగేశ్వరరావు, ఎస్సై గౌతమ్, చెక్ పోస్ట్ ఎస్సై రతన్ ప్రసాద్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.