అర్థరాత్రి ఇసుక దొంగలు… అధికారుల కళ్లకు గంతలు…
బుడ్డగూడెం, సోంపల్లి ప్రాంతంలో భారీగా ఇసుక అక్రమదందా
అధికారులకు తెలిసినా ఆపడంలేదెందుకో మరి…
✍🏽 దివిటీ మీడియా
ఓవైపు ఉన్నతాధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండగా, మరోవైపు క్షేత్రస్థాయి అధికారులు అక్రమదందాలకు సహకరిస్తూ, ‘సంపద సృష్టికర్తలు’గా మారుతున్నారు. ఏ అక్రమం జరగకుండా కాచుకోవాల్సినవారే కళ్లెందుకు మూసుకుంటున్నారనేది అంతా బహిరంగ రహస్యంగా మారింది. అవసరాల కోసం కాస్తోకూస్తో డబ్బులు తీసుకెళ్లేవారిని తనిఖీల్లో పట్టుకుని మరీ లెక్కలు, పత్రాలు, సాక్ష్యాలు అడుగుతున్న ఈ తరుణంలోనూ ‘అక్రమదందాలు మాత్రం’ ఏ అడ్డుఅదుపూ లేకుండానే అర్థరాత్రి జోరుగా సాగిపోతూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకూ తావివ్వకుండా పకడ్బందీ తనిఖీలతో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తున్న అధికారులు పడుతున్న శ్రమ, విధినిర్వహణలో వారు చూపిస్తున్న చిత్తశుద్ధి ప్రశంసనీయం. కానీ కనీసం తమపై ప్రజాప్రతినిధుల వత్తిడి లేని ఈ తరుణంలో కూడా అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారంటేనే అనుమానాలకు అవకాశం కలుగుతోంది. అర్థరాత్రి వేళ సాగే ఇసుక, పట్టపగలే సాగే మట్టి అక్రమరవాణా వ్యవహారాలను మాత్రం అధికారులెందుకు అడ్డుకోవడంలేదనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. బూర్గంపాడు మండలంలోని బుడ్డగూడెం, సోంపల్లి ప్రాంతాల్లో ప్రతిరోజు ‘ఇసుక అక్రమ రవాణా’ అర్థరాత్రి సమయం లో జోరుగా సాగుతోంది. మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన వ్యక్తితోపాటు, పాల్వంచ పట్టణానికి చెందిన పలువురు కాంట్రాక్టర్లు ప్రతిరోజు ‘జేసీబీలు, లారీలతో’ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. స్థానికులిస్తున్న సమాచారం ప్రకారం రోజుకు కనీసం పదికి పైగా లారీల ఇసుక అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులు, రోజుకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే రోజూ రూ.లక్షల ప్రజాసంపదను కొల్లగొడుతున్నవారికి అధికారులు శక్తికొద్దీ సహకారమందిస్తున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత యధేచ్ఛగా సాగిపోతున్న ఇసుక అక్రమరవాణా నిరోధానికి చర్యలుతీసుకుని సహజ సంపదను కాపాడాల్సిన మండల అధికారులకు సమాచారం అందిస్తున్నా ఈ దందాకు అడ్డుకట్ట పడటం లేదు. ఒక్కొక్క లారీకి రూ.50వేల వరకు ధర పలుకుతున్న నాణ్యమైన కిన్నెరసాని ఇసుక, ప్రతిరోజూ పదికిపైగా లారీలు తరలిస్తున్నవారు రోజుకు రూ.5లక్షలు సంపాదిస్తున్నారు. అంటే వారి అక్రమ సంపాదన తక్కువలో తక్కువగానే నెలకు రూ.15లక్షల వరకు ఉంటోంది. ఇంత ఘోరంగా, ఓపెన్ గా సాగిపోతున్న అక్రమ దందా నిరోధానికి అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని, తమ చిత్తశుద్ధి అందరికీ చాటిచెప్పాలని ఈ ప్రాంత ప్రజలు, అక్రమం గురించి ప్రశ్నించలేని అసహాయులు ‘దివిటీ మీడియా’ ద్వారా సూచిస్తున్నారు.