ఎన్నికలు పరిష్కరిస్తున్న వంతెన సమస్య
చిరుమళ్ల – కరకగూడెం వంతెన మరమ్మతులకు పీఓ ఆదేశాలు
మారుమూల పల్లెల్లో పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఐటీడీఏ పీఓ
✍🏽 దివిటీ మీడియా – మణుగూరు
తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు కొన్నిసమస్యలు పరిష్కారమయ్యే
పరిస్థితికి కారణమవుతున్నాయి. ఓటర్లకు సదుపాయాల కల్పన కోసం అధికారులు చేపడుతున్న చర్యల్లో భాగంగా పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిరుమళ్ల – కరకగూడెం గ్రామాల మధ్య కొట్టుకుపోయి ఉన్న వంతెన మరమ్మతులకు అవకాశం కలిగింది. శుక్రవారం (అక్టోబరు 13వ తేదీ) పినపాక నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, భద్రాచలం ఐటీడీఏపీఓ ప్రతీక్ జైన్ పినపాక నియోజకవర్గంలోని మారుమూల గుండాల, కరకగూడెం మండలాల్లో పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన సందర్భంగా, అధికారులు ఆ వంతెన మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పటిష్ఠంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస అవరాలైన మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. సౌకర్యాలు లేని పోలింగ్ కేంద్రాల్లో తక్షణమే సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పినపాక నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగ, 80 సంవత్సరాలు పైబడిన వృద్ధ ఓటర్లు ఓటుహక్కు వినియోగానికి ఎలాంటి ఇబ్బంది పడకుండా మ్యాపింగ్ చేసినట్లు చెప్పారు. సెక్టోరల్ అధికారులు నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు పరిశీలించాలని, ఎక్కడైనా సౌకర్యాలు కల్పించాల్సి ఉంటే తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వర్షాల వల్ల కోతకు గురైన చిరుమళ్ల – కరకగూడెం వంతెన మరమ్మత్తు పనులను పరిశీలించారు. పోలింగ్ కేంద్రం నెంబరు.35లో ఓటుహక్కు వినియోగానికి వంతెన దాటాల్సి ఉన్నందున రవాణాకు ఎలాంటి ఇబ్బంది పడకుండా మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు, గుండాల, కరకగూడెం మండలాల తహసీల్దార్లు, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.