అటవీ సంరక్షణ, ఎల్.డబ్ల్యు.ఇ ప్రాంతాల అభివృద్ధిలో సమతూకం లక్ష్యంగా…
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వర్క్ షాప్
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు
అటవీ సంరక్షణ చట్టం -1980లో ఇటీవల సవరణల నేపథ్యంలో, “అటవీ సంరక్షణ- తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాల మధ్య సమతూకం సాధించే లక్ష్యంతో శుక్రవారం హైదరాబాదులో అటవీ జీవవైవిధ్యసంస్థ ఆధ్వర్యంలో ఓ వర్క్ షాప్ నిర్వహించారు. దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అటవీసంరక్షణలో జాతీయ, అంతర్జాతీయ కట్టుబాట్లు సాధించేందుకు, అటవీ సంరక్షణ చట్టంలోని అస్పష్టతలను తొలగించి వివిధ రకాల భూముల విషయం లో చట్టం వర్తింపు గురించి, అటవీయేతర ప్రాంతాలలో ప్లాంటేషన్ల పెంపకానికి, అటవీ ఉత్పాదకత పెంచడానికి, స్థానిక సమాజాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి చేసిన చట్టసవరణపై విస్తృతచర్చ సాగింది. జీవవైవిధ్య సంస్థ డైరెక్టర్ ఇ వెంకట్ రెడ్డి, ఈ వర్క్ షాప్ నకు హాజరైన అధికారులకు స్వాగతం పలికారు. అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర అటవీదళాల అధిపతి ఆర్.ఎం. డోబ్రియాల్ ఈ వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అటవీ సంరక్షణ చట్టం అమలులో తలెత్తే సమస్యలకు వర్క్ షాప్ పరిష్కారాలను సూచిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మరో అతిథి బెంగళూరు ప్రాంతీయ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి.సుబ్రహ్మణ్యం, మాట్లాడుతూ సవరించిన అటవీ సంరక్షణ చట్టంపై ఉన్న అపోహలను తొలగించడానికి ఈ వర్క్ షాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యఅతిథి గా విచ్చేసిన కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రిత్వశాఖ ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ రమేశ్ పాండే మాట్లాడారు. ఇలాంటి వర్క్ షాప్ లు సవరించిన అటవీ సంరక్షణ చట్టానికి సరైన నియమ నిబంధనలను రూపొందించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అటవీ ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన అటవీ అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు.
న్యాయనిపుణులు డి.వి.ఎన్.మూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.జి.వినీత్, కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ బెంగళూరు ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ ఇన్స్ పెక్టర్ జనరల్ ఎం.కె.శంభు వివిధ సాంకేతిక అంశాలపై ప్రసంగించారు. , హైదరాబాదు అటవీ జీవవైవిధ్య సంస్థ అధికారి సందీప్ ప్రాటీ వందన సమర్పణతో ఈ వర్క్ షాప్ ముగిసింది.