ఆటోలలో డీజే మోతలు, నిబంధనలపై చర్యలు
తనిఖీలతో హెచ్చరించిన ఎస్సై రాజ్ కుమార్
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
ప్రయాణికులను రవాణా చేసే ఆటోలలో
డీజే బాక్సులు ఏర్పాటు చేసుకుని ప్రజలను ప్రయాణికులను భరించలేని సౌండ్స్ తో ఇబ్బందులకు గురి చేస్తున్న ఆటోడ్రైవర్లపై కఠినచర్యలు తప్పవని బూర్గంపాడు ఎస్సై రాజ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు చాలా సంవత్సరాల తర్వాత బూర్గంపాడు మండలంలో పోలీసులు డీజే బాక్సులున్న ఆటోలను తనిఖీలలో గుర్తించి డ్రైవర్లకు హెచ్చరికలు చేశారు. బూర్గంపాడు మండల పరిధిలో ఆటోలను శుక్రవారం ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆటోలలో గుర్తించిన డీజేలను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ఆటో లోపల సౌండ్ బాక్సులు పెట్టి విపరీతమైన సౌండ్ తో మండలంలో తిప్పినట్లయితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆదేశాలను ధిక్కరించి ఆటోలో డీజే బాక్సులు ఏర్పాటు చేసినా, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదకరంగా నడిపేవారిని ఇకపై సహించేది లేదన్నారు. ఆటోడ్రైవర్లు ఆటోలను ప్రధాన సెంటర్లలో ఎక్కడపడితే అక్కడ ఆపి ప్రయాణికులు, ఇతర వాహన దారులు, పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని తెలియజేశారు. ఆటోలు నడిపే డ్రైవర్లంతా తప్పకుండా ఖాకీచొక్కా ధరించి ఉండాలని, ఆటో నడిపే ప్రతి డైవర్ లైసెన్స్ పొంది ఉండాలని తెలిపారు. లైసెన్స్ లేని డ్రైవర్లకు ఆటో ఓనర్లు తమ ఆటోలను ఇవ్వవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా ఇచ్చినట్లయితే వారి పైన కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఆటోడ్రైవర్లు నిబంధనలు పాటించకుండా, డీజే సౌండ్స్ నడుమ, మరికొందరు చెవుల్లో ‘ఇయర్ ఫోన్లలో’ మ్యూజిక్ ఆస్వాదిస్తూ వెనుక వచ్చే వాహనాల హారన్లు కూడా వినే స్థితిలో లేకుండా డ్రైవింగ్ చేస్తుండటం తీవ్ర ప్రమాదకరంగా మారింది. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు పెద్దగా ప్రమాదాలేమీ జరగక పోయినప్పటికీ, జరిగిన తర్వాత చింతించే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై రాజ్ కుమార్ బూర్గంపాడు మండలంలో చాలాకాలం తర్వాతనైనా ఆటోడ్రైవర్లతో నిబంధనలు పాటింపజేసే రీతిలో చర్యలు తీసుకుంటుండటంతో అభినందిస్తున్నారు.