జాబ్ మేళాలు సద్వినియోగం చేసుకోండి : ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులు ఐటీడీఏ నిర్వహిస్తున్న జాబ్ మేళాలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని జీవనోపాధి పెంచుకోవాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ సూచించారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో నిర్వహించిన బుధవారం నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన పాల్గొని, జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగ యువతీ యువకుల అభిప్రాయాలు, మనోగతం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో ఉద్యోగాలు చేస్తూ మెరుగైన జీవనం గడిపే అవకాశం కల్పించేందుకు ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. తక్కువ వేతనం వస్తుందని ఎవరు నిరుత్సాహ పడకూడదని, ఓవైపు లభించిన ఉద్యోగం చేసుకుంటూ, విద్యార్హతలతో ప్రయత్నిస్తే తప్పక మెరుగైన ఉద్యోగం లభిస్తుందని తెలిపారు. ఆదివాసీ గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న గిరిజన యువతీ యువకులు గ్రూపుగా ఏర్పడితే, కోరుకున్న రంగాలలో శిక్షణ అందిస్తామన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, మొబైల్ రిపేరింగ్, కుట్టు శిక్షణ, ఎలక్ట్రీషియన్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్స్ కు సంబంధించిన శిక్షణలు ఇచ్చి, స్వతంత్రంగా జీవించడానికి అవకాశాలు కల్పిస్తామన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకోవడానికి గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి గ్రూపులో 10 మంది సభ్యులుండాలని పీఓ సూచించారు. గ్రూపులకు 60 శాతం సబ్సిడీ, 10శాతం బెనిఫిషర్ కంట్రిబ్యూషన్, 30శాతం బ్యాంకు లోన్ ద్వారా పరిశ్రమలు స్థాపించుకునేలా అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. దీనివల్ల కుటుంబాలను పోషించుకోవడంతో పాటు పదిమందికి ఉపాధి కల్పించడానికి దోహద పడతారని, అటువంటి పథకాల కోసం గిరిజన యువత ముందుకు రావాలన్నారు. యువతీ యువకులు కొంత మంది సాఫ్ట్ వేర్ రంగాలలో ఉద్యోగ భృతి కల్పించాలని, మరికొందరు టెట్ డీఎస్సీ కోచింగ్ ఇప్పించాలని కోరారు. స్పందించిన పీఓ ప్రతీక్ జైన్, వారికి తప్పకుండా శిక్షణ ఇప్పిస్తామని, జీవనోపాధి కోసం ఎటువంటి శిక్షణలైనా విడతలవారీగా అందజేస్తామని తెలిపారు. ప్రైవేటు,ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, గిరిజన యువతీ యువకులు సద్వినియోగం చేసుకుని కుటుంబాలను పోషించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ (జనరల్) డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ, పలు కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగ యువతీ, యువకులు పాల్గొన్నారు.