Divitimedia
Bhadradri KothagudemPoliticsTelangana

లబ్ధిదారులకు సంక్షేమ పథకాలందేలా త్వరగా పూర్తి చేయాలి

లబ్ధిదారులకు సంక్షేమ పథకాలందించడం త్వరగా పూర్తి చేయాలి

వీడియో కాన్ఫరెన్సులో జిల్లా అధికారులకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

ప్రభుత్వ కార్యక్రమాల అమలు, లక్ష్యాలు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, వచ్చే నెల 1వ తేదీన హైదరాబాదులో నిర్వహించే స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొనేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, జిల్లా అటవీశాఖాధికారి కిష్టాగౌడ్, డీఆర్డీఓ మధుసూదన్ రాజులతో కలిసి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకలు, తెలంగాణకుహరితహారం, ఆసరా ఫించన్లు, రెండోవిడత గొర్రెలపంపిణీ, బీసీ, మైనారిటీ లకు రూ.లక్ష సహాయం, గృహలక్ష్మి, దళిత బంధు, ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, కారుణ్య నియామకాలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ, తదితర అంశాలపై సీఎస్ జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులతో సమీక్షిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి జిల్లా నుంచి హాజరయ్యే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జడ్పీ సీఈఓకు సూచించారు.

వృద్దాప్య, ఆసరా ఫించను దారులెవరైనా మరణించిన పక్షంలో వారి భాగస్వామికి పెన్షన్ బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, క్షేత్రస్థాయిలో పెండింగ్ లో ఉన్న ఆసరా ఫించన్ దరఖాస్తులను మూడు రోజుల్లో మంజూరు చేయాలని కలెక్టర్ తెలిపారు. గొర్రెల పంపిణీ పథకంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటున్నామని, జిల్లాలో భవిష్యత్తులో కూడా ఇదే రితీలో త్వరితగతిన యూనిట్ల గ్రౌండింగ్ కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

బీసిలకు కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం మొదటి దశలో మంజూరైన చెక్కుల పంపిణీ పూర్తయినందున, రెండవ దశ అమలుకు చర్యలు తీసుకోవాలని, రెండవ విడతలో ఆన్ లైన్ లో మాత్రమే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

గృహలక్ష్మి పథకం దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్దిదారుల జాబితా జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఆమోదం తీసుకొని మంజూరు చేయాలని తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదంతో గృహలక్ష్మి లబ్దిదారుల ఎంపిక చేసి, ఆన్ లైన్ యాప్ లో వివరాల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అనంతరం ఇండ్ల నిర్మాణ పనులు మొదలు కాగానే మొదటి విడత లక్ష రూపాయలు విడుదల చేయడం జరుగుతుందని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

రెండవ విడత దళిత బంధు పథకం కింద వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులను ఎంపిక చేయాలని అన్నారు. హరితహారంలో కేటాయించిన లక్ష్యాన్ని వచ్చే నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని చెప్పారు. పోలీసు, రెవెన్యూ, పరిశ్రమలు, విద్యా, అటవీ అభివృద్ది సంస్థ, సింగరేణి సంస్థలకు కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అటవీ, డిఆర్డీఓలకు సూచించారు. నోటరీ డాక్యుమెంట్స్ భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులపై విచారణకు టీములు ఏర్పాటు చేయాలని ఏఓ గన్యాను కలెక్టర్ ఆదేశించారు. జీఓ.59 ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ విద్యాలత,
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సంజీవరావు, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, పశు సంవర్ధక శాఖ డీడీ పురందర్, భద్రాచలం ఆర్డీఓ మంగీలాల్, తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ప్రజావాణి లో ప్రజల నుంచి ఫిర్యాదులు, దరఖాస్తులు స్వీకరించి, పలు సమస్యల పరిష్కారం కోసం మండల, జిల్లా స్థాయి అధికారులకు ఎండార్స్ చేశారు. అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

నవంబరు 10న ఉమ్మడి జిల్లా పాఠశాలల బాక్సింగ్, సాఫ్ట్ బాల్ ఎంపికలు

Divitimedia

జిల్లాలో అధ్వానంగా నేషనల్ హైవే నిర్వహణ

Divitimedia

ప్రజావాణి కార్యక్రమం నిర్వహించిన డీఆర్ఓ

Divitimedia

Leave a Comment