ఇల్లందులో టీఎస్ఆర్టీసీ కొత్త డిపో ప్రారంభం
అభివృద్ధికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి
✍🏽 దివిటీ మీడియా – ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కొత్త బస్ డిపో ఏర్పాటు చేశారు. పట్టణంలోని టీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రు.3.75 కోట్ల వ్యయంతో నిర్మించిన బస్ డిపోను రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం (ఆగస్టు 28) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్ స్టాండ్లో రూ.1.50కోట్ల వ్యయంతో నిర్మించ నున్న సిమెంట్ కాంక్రీట్ ప్లాట్ ఫాం పనులకు శంకుస్థాపన చేశారు. డిపోలో బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి ఓ బస్ ను లాంఛనంగా నడిపారు. డిపో ప్రాంగణం లో ఏర్పాటు చేసిన సభలో సర్వమతాల ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం ఇల్లందు పట్టణంలో విస్తృత పర్యటనలో మంత్రి పువ్వాడ అజయ్, రూ.18.25 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనుల కు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇల్లందు కరెంట్ ఆఫీస్ దగ్గర రూ.10కోట్ల వ్యయంతో ఖమ్మం-ఇల్లందు ప్రధాన రహదారి విస్తరణ, అభివృద్ది, రోడ్డుడివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణం పరిధిలోని జె.కె కాలనీలో రూ.1కోటితో నిర్మించనున్న లైబ్రరీ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసి,
జగదాంబ సెంటర్లో రూ.50లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును, రూ.1.50కోట్లతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఇల్లందులో ప్రజల సౌకర్యార్థం, ఎమ్మెల్యే హరిప్రియ విజ్ఞప్తి మేరకు 3.75 కోట్లు మంజూరు చేసి బస్ డిపో ఏర్పాటు చేసి ప్రారంభించినట్లు తెలిపారు. ఒకప్పుడు బొగ్గుతో నిండిపోయి ఉన్న బొగ్గుట్టకు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్దిని పరిచయం చేశామని వివరించారు. బస్ డిపో ఇచ్చినందు వల్ల ఆర్టీసీని కాపాడాలని, ఇది మన ప్రగతికి చిహ్నమని, ప్రజలకు ఆర్టీసీకి ఉన్న బంధం విడదీయలేనిదన్నారు. ప్రజల అవసరార్థం ఎన్ని బస్సులయినా ఇస్తామని, వాటిని ఆదరించాలని కోరారు. సంస్థలో 43 వేల మంది కుటుంబాలలో వెలుగులు నింపిన మహనీయుడు కేసీఅర్, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యను ఒక్కమాటతో పరిష్కరించారని తెలిపారు. లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు నిత్యం ఆర్టీసీ బస్సులో ప్రయాణం సాగిస్తున్నారని, వారందరికీ మంచి సేవలందిస్తున్న ఆర్టీసీని ఆదరించాలని మంత్రి కోరారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎస్పీ డాక్టర్ వినీత్, అదనపు కలెక్టర్ రాంబాబు, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.