అడవిలో పడేసిన హరితహారం మొక్కలకు బాధ్యులెవరో?
నోరుమెదపని ఉన్నతాధికారులకు బాధ్యత లేదా?
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం హరితహారంతో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతిఏటా మొక్కలు నాటేందుకు రూ.కోట్లు ఖర్చుపెడుతుంటే ఆ తంతును తూతూమంత్రంగా మార్చివేస్తున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధి లోని బూర్గంపాడు మండలంలో మొక్కలు పెద్దసంఖ్యలో వృధాగా పారేసిన వ్యవహారం వెలుగు చూసింది. మండలంలో కృష్ణసాగర్ అటవీప్రాంతంలో హరితహారం మొక్కలను గుట్టలుగా పారేసిన విషయాన్ని ఆదివారం (ఆగస్టు 20) ‘దివిటీ మీడియా’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇంతటి తీవ్రస్థాయి నిర్లక్ష్యం వెలుగు చూసినప్పటికీ, దీనిపై ఉన్నతాధికారులు నోరుమెదపకుండా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ మొక్కలు నాటే కార్యక్రమం ‘ప్రతిఏటా జరిగే తంతే కదా…?’ అనే భావన అధికారుల్లోనూ ఉందేమోననే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పారేసిన ఆ మొక్కలకు బాధ్యత ఎవరిదో? వాటిని ఏలెక్కల్లో రాసుకున్నారో? తేల్చాల్సిన ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు ప్రారంభించలేదు. అసలు ‘హరితహారం కార్యక్రమానికి’ విలువే లేదా?, లేకపోతే ఆ మొక్కలు పెంచిన ప్రజాధనానికి విలువ లేదా? అని పర్యావరణ పరిరక్షకులు ప్రశ్నిస్తున్నారు. పచ్చని మొక్కలను చెట్లుగా పెంచడం ద్వారా పర్యావరణం కాపాడుకునే లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చుచేస్తున్న విలువైన ప్రజాధనం ఇలా వృధా అవుతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణసాగర్ వద్ద అటవీప్రాంతంలో మొక్కలు వృధాగా పడేసి ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించినవారెవరు అనే విషయం తేల్చే బాధ్యత అధికారులపై ఉంది. లేదంటే హరితహారం కార్యక్రమంలో పచ్చదనం పెంచాలనే లక్ష్యంపైనే ప్రజలకు ఏమాత్రం ఆసక్తి లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది. బూర్గంపాడు మండలంలో గ్రామపంచాయతీలపై పర్యవేక్షణ చేయాల్సి ఉన్న మండల అధికారులు, తమ నిర్లక్ష్యం, పనితీరుకు అద్దం పడుతున్న ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బూర్గంపాడు మండల పరిధిలో 17
గ్రామపంచాయతీలుండగా, అడవిలో పడేసి ఉన్న ఈ మొక్కల పాపం ఏ పంచాయతీదో తేల్చాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. ఈ నెల 26వ తేదీన తెలంగాణ ప్రభుత్వమే అధికారికంగా ‘కోటివృక్షార్చన’ పేరుతో చేసే మొక్కలు నాటే కార్యక్రమానికి ముందే ఈ అడవిలో పారేసిన మొక్కల వ్యవహారంపై విచారణ జరిపి, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. మొక్కలను వృధాగా అడవిలో పారేసిన సంఘటనపై విచారణ గురించి ‘దివిటీ మీడియా’ బూర్గంపాడు ఎంపీడీఓ వివేక్ రామ్ దృష్టికి తీసుకెళ్లగా, విచారణ జరుపుతామని చెప్పారు.