ఎల్.డబ్ల్యు.ఇ పనులపై ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్సు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పురోగతి వివరించిన కలెక్టర్, ఎస్పీ
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై రాష్ట్ర ఉన్నతాధికారులు శుక్రవారం వీడియో కాన్ఫరెన్సులో సమీక్షలు నిర్వహించారు. హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి అంజనీకుమార్ యాదవ్ ఈ సమీక్ష నిర్వహించగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధుల (ఎస్.సి.ఎ)తో చేపట్టిన పనులు వేగవంతం చేసి, త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఈ సందర్భంగా వివరించారు. ఈ జిల్లాలో రూ.10.25 కోట్లతో 24 పనులు చేపట్టినట్లు వివరించారు. వీటిలో రెండు పనులు జిల్లా వైద్యశాఖ, 8 పనులు గిరిజన ఇంజనీరింగ్ విభాగం, 3పనులు ఆసుపత్రులసమన్వయ అధికారి, 2 పనులు జిల్లా విద్యాశాఖ, ఒక పని భద్రాచలం ఇరిగేషన్ బ్రాంచి, 4 పనులు భద్రాచలం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, 2 పనులు టిఎస్ఎంఎస్ఐడిసి, ఒక పని మిషన్ బగీరథ (గ్రిడ్), మరొక పని మిషన్ భగీరథ (ఇంట్రా) కేటాయించినట్లు చెప్పారు. చేపట్టిన 24 పనుల్లో 4 పనులు పూర్తి కాగా కొన్ని పనులు టెండర్ దశలోను, మరికొన్ని పనులు పురోగతిలోను ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు తెలిపారు.