సంస్కృతి, సంప్రదాయాలు పాటించడంలో గిరిజనులు ఆదర్శం
ఆదివాసీ దినోత్సవ వేడుకలలో కలెక్టర్ డా.ప్రియాంక
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
ఇతిహాసం, నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలను పాటించడంలో ఆదివాసీ గిరిజనులను ఆదర్శంగా తీసుకుని ప్రపంచ, దేశ జనాభా సంస్కృతి, సాంప్రదాయాలు పాటిస్తే ఆదివాసీ తెగ అంతరించిపోకుండా కాపాడుకున్న వారమవుతామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక అలా కొనియాడారు. ఆదివాసీదినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం భద్రాచలంలో ఆదివాసీ గిరిజనభవనంలో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు, గంటందొర, మల్లుదొర వంటి ఎందరో ఆదివాసీ వీరుల ప్రాణత్యాగ ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్న విషయం గుర్తు చేశారు. 1982లో నెదర్లాండ్ లో ఆదివాసీలు స్వేచ్ఛ స్వాతంత్ర్యంగా జీవించడానికి ఐక్యరాజ్యసమితిలోని 140 దేశాల ప్రతినిధులు ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవంగా తీర్మానం చేయడం వల్ల, నేడు ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరుపుకుంటున్నారన్నారు. ప్రపంచంలో 7 భాషలు ఉన్నాయని 90 శాతం భాషలు ఆదివాసీలకు సంబంధించినవని, భాషలు లేని ఆదివాసీలు 5శాతం మాత్రమేనన్నారు. ఆదివాసీలు తక్కువ మంది మాత్రమే తమ భాషలో మాట్లాడతారని, ఈ పరిస్థితి వల్ల భాష, సంస్కృతిసంప్రదాయాలు అంతరించి పోయే ప్రమాదం ఉందన్నారు. దాదాపు పది కోట్ల మంది వరకు తెలుగు మాట్లాడతారని, అమెరికా వారు కూడా తెలుగు నేర్చుకుని మాట్లాడడానికి ప్రయత్నిస్తారని, అయినా వారి సాంప్రదాయాన్ని భంగం రానివ్వరని ఆమె తెలిపారు. ఆదివాసి కుటుంబాలలో తమ పిల్లలకు చిన్నప్పటినుంచి సంస్కృతి సాంప్రదాయాలు, భాషలోని ప్రాముఖ్యతను తల్లిదండ్రులు నేర్పించాలన్నారు. ఆదివాసీ గిరిజనులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని, ఆదివాసీలకు తప్పనిసరిగా జీవనోపాధి కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి(పీఓ) ప్రతిక్ జైన్, సహాయ ప్రాజెక్టు అధికారి (జనరల్) డేవిడ్ రాజ్, పరిపాలనాధికారి భీమ్, ఆదివాసీల సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ కూడలి సమీపంలోని ఆదివాసీ గిరిజనుల అమరవీరుల స్థూపాలకు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ఆదివాసి గిరిజనుల పిల్లల కోసం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఆశ్రమ పాఠశాలలు ,వసతిగృహాలు గురుకుల పాఠశాలలు నెలకొల్పి వారి విద్యాభివృద్ధికి ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరిజనులు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక చేకూర్పు చేసుకొని జీవించడానికి ఐటిడిఏ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకే అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లా కలెక్టర్, తాను కొత్తగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించామని, గిరిజనులకు సంబంధించి ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజన భవన్లో ఏర్పాటుచేసిన ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన నృత్యాలను వారు తిలకించారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్, ఐటిడిఏపీఓ, పలువురు గిరిజన సంఘాల నాయకులను సన్మానించారు. వారితోపాటు 10తరగతిలో ఏ గ్రేడ్ సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎం వెంకటేశ్వర్లు (అంకంపాలెం) విజయలక్ష్మి(డి గొల్లగూడెం) లను ప్రత్యేకంగా ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ సన్మానించారు. కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మ, ఏసీఎంఓ రమణయ్య, ఏటిడిఓ నరసింహారావు, భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబురావు, గిరిజన సంఘ నాయకులు పూనెం కృష్ణదొర, పాయం రవి వర్మ, శరత్ బాబు, మురళి, రమేష్, పుల్లయ్య, వీరస్వామి, శ్రీరామ్మూర్తి, సుధారాణి, అరుణ, వెంకటరావు, వీరభద్రం వివిధ గ్రామాలకు చెందిన గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.