జిల్లాలో ఐసీడీఎస్ అధికారులకు ‘ఛార్జ్ మెమోలు’…

విచారణపై ఎనిమిది నెలల తర్వాత కదలిక

బాధ్యులపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలిమరి!
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 14)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఐసీడీఎస్ ప్రాజెక్టులో సంచలనం సృష్టించిన పూర్వ అధికారుల అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ఉన్నతాధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ సీడీపీఓ సిబ్బందిని బెదిరిస్తూ, ఉన్నతాధికారులను మభ్య పెడుతూ చాలాకాలం పాటు అక్రమాలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో అక్రమాలు, సిబ్బంది నుంచి వసూళ్లపై అప్పటి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, వికలాంగులు, వయోవృద్దుల సంక్షేమశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ శాఖ వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ఝాన్సీలక్ష్మీభాయి గత ఏడాది నవంబరు 12, 13 తేదీల్లో విచారణలు జరిపారు. జిల్లాలో పాల్వంచ, టేకులపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అక్రమ వసూళ్లు, అస్తవ్యస్త పరిస్థితులపై 2024 నవంబరు 10వ తేదీన “దివిటీ మీడియా”లో “సంక్షేమం మాటున చక్కగా వసూళ్లు” శీర్షికతో ప్రచురితమైన సమగ్ర కథనంతో రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించి ఆ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు వరంగల్ ఆర్జేడీ టేకులపల్లి, పాల్వంచ ప్రాజెక్టుల్లో రెండురోజులపాటు విచారణ చేశారు. ఈ విచారణలో భాగంగా ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీభాయి, ఆ రెండు ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ టీచర్లతోపాటు సూపర్ వైజర్లు, సీడీపీఓల నుంచి వివరాలు, వాంగ్మూలాలు సేకరించారు. ఇదే అంశంలో అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో గతంలో ఇక్కడ పని చేసిన పాల్వంచ ప్రాజెక్టు అధికారి, ఉద్యోగులతో కుమ్మక్కై ఇంటిఅద్దెలు, ఇతర బిల్లుల్లోనూ భారీగా ముడుపులు తీసుకున్నట్లు వెల్లడైంది. ఆమె వసూళ్ల కోసం ప్రాజెక్టులోని కొందరు అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లను మధ్యవర్తులుగా వాడుకున్నట్లు ‘క్లియర్’గా బయటపడిన విషయాన్ని గుర్తించారు. ఈ పరిస్థితుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడిన అధికారులు విచారణ, తదనంతరం చర్యల నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నం చేస్తూ వచ్చారు. 2024 నవంబరు 12, 13 తేదీల్లో పాల్వంచ ప్రాజెక్టులో ఆర్జేడీ విచారణలోనూ పలువురు అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు వాంగ్మూలాలు ఇచ్చారు. అవినీతిపరులైన సీడీపీఓల వల్ల తాము పడిన ఇబ్బందులు, బాధల గురించి కూడా మౌఖికంగా విచారణలో పంచుకున్నారు. పర్యవేక్షణ పక్కన పెట్టి మరీ ఆ సీడీపీఓలు, వారికి సహకరించిన కొందరు కార్యాలయసిబ్బంది, పలువురు మధ్యవర్తుల సహాయ సహకారాలతో తీవ్ర వత్తిడితో వసూళ్లకు పాల్పడింది వాస్తవమేనని పలువురు విచారణలలో చెప్పారు. అప్పటి అవినీతి సీడీపీఓల తర్వాత వారి స్థానాలలో బాధ్యతలు చేపట్టిన సీడీపీఓ కూడా ఈ అక్రమాలపై తనకు తెలిసిన సమాచారం విచారణలో కుండబద్దలు కొట్టారు. కొందరు మాత్రం ఆ సీడీపీఓలతో తమకున్న సంబంధాలు, అనుబంధాలతో, భయాల కారణంగానో అనుకూలంగా చెప్పినట్లు తెలిసింది. ఆ విచారణలో అంగన్వాడీటీచర్లు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేయలేని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. జిల్లాతో పాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాల్వంచ ఐసీడీఎస్ ప్రాజెక్టు అక్రమాల వ్యవహారాల్లో రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికలు ఆలస్యంగా అందడం వల్లనో, ఇతర కారణాల వల్లనో ఉన్నతాధికారుల బదిలీల తర్వాత ఇంతకాలానికి ‘ఛార్జ్ మెమోలు’ జారీ చేశారు. పాల్వంచ గత సీడీపీఓకు, ప్రస్తుత సూపర్వైజర్ ఒకరికి, జిల్లాలో ఇతర ప్రాజెక్టులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు అధికారులకు నాలుగైదు రోజుల క్రితం ఛార్జ్ మెమోలు జారీ అయినప్పటికీ జిల్లా అధికారులు సమాచారం బయటకు వెల్లడించకుండా గోప్యత పాటించడం గమనార్హం. దీనిపై జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలతలెనినాను ‘దివిటీ మీడియా’ సంప్రదించగా జిల్లాలో కొందరికి ఛార్జ్ మెమోలు వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు.