Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadLife StyleSpot NewsTechnologyTelangana

ఆన్ లైన్ ద్వారా ఎండీఎం బిల్లుల చెల్లింపులకు చర్యలు

ఆన్ లైన్ ద్వారా ఎండీఎం బిల్లుల చెల్లింపులకు చర్యలు

భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు

వీడియో కాన్ఫరెన్సులో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా

భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 3)

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో
మధ్యాహ్న భోజన పథకం బిల్లులను ఆన్ లైన్ ద్వారా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నూతన విధానంలో బిల్లుల చెల్లింపులు క్షేత్రస్థాయిలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో ఎంపిక చేసిన రెండు మండలాల్లో పరిశీలించిన తర్వాత లోపాలు సవరించి రాష్ట్రమంతటా అమలు చేయనున్నారు. ఈ మేరకు సోమవారం (మార్చి 3) రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి, ఈ రెండు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్ల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా మాట్లాడుతూ, ట్రెజరీ ద్వారా మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆలస్యం అవుతోందని, నేరుగా ఆన్లైన్ విధానంలో బిల్లులు చెల్లించేందుకున్న అవకాశాలను విద్యాశాఖ పరిశీలిస్తోందన్నారు. రాష్ట్రం లో ముందస్తుగా భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఆన్ లైన్ బిల్లుల చెల్లింపు విధానాన్ని ప్రారంభిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ రెండు జిల్లాల్లో ముందుగా ఒక్కొక్క మండలం చొప్పున ఎంపిక చేసుకుని, నెలరోజులపాటు ఆ రెండు మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం బిల్లులను ఆన్లైన్ ద్వారా త్వరితగతిన చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు నుంచి వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ చెల్లింపులు జరపడానికి ఏర్పాట్లు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో భాగంగా ఉండే వివిధ రకాల రిపోర్టులు, ప్రస్తుత యాప్ లో ఒకేసారి జనరేట్ అయ్యే విధంగా లేవన్నారు. నెలవారి సంగ్రహక రిపోర్టు ఆధారంగా బిల్లులు ఆటోమేటిక్ గా (వాటికవే) జనరేట్ అయ్యే విధంగా ప్రత్యేక ప్యాకేజీతో మధ్యాహ్న భోజన పథకం యాప్ ను మెరుగుపరచాల్సి ఉంటుందన్నారు. మధ్యాహ్న భోజన పథకం యాప్ ద్వారా రోజువారీ హాజరు పాఠశాల స్థాయిలో కచ్చితంగా ఆన్లైన్ పద్ధతిలో ఇవ్వవలసి ఉన్నందున దానికి ఆయా పాఠశాలల హెచ్ఎంలు యాప్ లో విద్యార్థుల ఖచ్చితమైన హాజరు వివరాలు నమోదు చేయాలన్నారు. ఆ వివరాలతో నెలవారీ రిపోర్టును ఎంఈఓ ఆన్లైన్ లో ధ్రువీకరించడం ద్వారా మధ్యాహ్న భోజన పథకం బిల్లులు ఆన్లైన్ లో జనరేట్ అయ్యేలా యాప్ ను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. అలాంటి యాప్ రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో విద్యాశాఖ జిల్లా అధికారి వెంకటేశ్వరచారి, కొత్తగూడెం ఎంఈఓ డాక్టర్ ప్రభుదయాల్, ఎఫ్ఓ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పెండింగ్ శాలరీ బిల్లు చేయడానికి రూ.10వేలు లంచం

Divitimedia

భద్రాచలం ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన మంగీలాల్

Divitimedia

మంచినీటి పైపులైన్ల లీకేజీలు తక్షణం మరమ్మతు చేయాలి

Divitimedia

Leave a Comment