Divitimedia
DELHIHyderabadNational NewsPoliticsSpot NewsTelanganaWomen

పెండింగ్ గ్రాంట్ కోసం కేంద్రమంత్రిని కలిసిన సీఎం

పెండింగ్ గ్రాంట్ కోసం కేంద్రమంత్రిని కలిసిన సీఎం

✍️ న్యూఢిల్లీ – దివిటీ (డిసెంబరు 13)

రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ‌లోని వెనుక‌బ‌డిన జిల్లాల‌కు పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంట్ వెంట‌నే విడుద‌ల చేయాల‌ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞ‌ప్తిచేశారు. రాష్ట్రంలో 9 జిల్లాలకు సంబంధించి 2019 నుంచి 2024వరకు ప్రతి ఏటా రూ.450 కోట్లు చొప్పున గ్రాంట్ విడుద‌ల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీక‌రించిన అంశాన్ని ఆమె దృష్టికి తెచ్చిన ముఖ్యమంత్రి ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ముఖ్య‌మంత్రి రాష్ట్ర ఎంపీలతో కలిసి పార్లమెంట్ లో శుక్రవారం నిర్మలా సీతారామన్ ను కలిశారు. తెలంగాణకు సంబంధించి పెండింగులో ఉన్న పలు అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రం పున‌ర్విభ‌జ‌న జరిగిన త‌ర్వాత హైద‌రాబాద్‌ లోని హైకోర్టు, రాజ్ భ‌వ‌న్‌, లోకాయుక్త‌, రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌, జ్యుడీషియ‌ల్ అకాడ‌మీ స‌హా ఉమ్మ‌డిసంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌ను తెలంగాణ ప్ర‌భుత్వ‌మే భ‌రించిన విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఆయా సంస్థ‌ల విభ‌జ‌న పూర్త‌య్యేవ‌ర‌కు నిర్వ‌హ‌ణ‌కు రూ.703.43కోట్లు తెలంగాణ భ‌రించగా, ఖర్చులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాటా రూ.408.49 కోట్లు తెలంగాణ‌కు చెల్లించాల్సి ఉంద‌ని చెప్పారు. ఆ నిధులు చెల్లించడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. ఆవిషయంలో కేంద్ర హోంశాఖ కూడా ఏపీ ప్రభుత్వానికి లేఖ‌లు రాసినట్టు గుర్తుచేశారు. వ‌డ్డీతో స‌హా ఆ మొత్తం తెలంగాణ‌కు చెల్లించేలా కేంద్రప్ర‌భుత్వం ఉత్త‌ర్వులివ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్ది కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో విదేశీ ఆర్థిక సహాయంతో చేప‌ట్టిన పలు ప్రాజెక్టుల‌కు సంబంధించి తెలంగాణ, ఏపీ మ‌ధ్య రుణాలపంపిణీ విష‌యంలో తెలంగాణ నుంచి రూ.2,547.07 కోట్లు రిక‌వ‌రీకి కేంద్రం ఏక‌ప‌క్షంగా ఆదేశాలు ఇచ్చింద‌న్నారు. ఆ విష‌యంపై మ‌రోసారి స‌మీక్షించి స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని సీఎం కోరారు. 2014-15 సంవత్సరంలో కేంద్ర ప్రాయోజితప‌థ‌కాల‌కు సంబంధించి నిధుల‌ను కేంద్రం కేవలం ఏపీకి మాత్రమే కేటాయించిందని గుర్తుచేశారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న ఆ నిధులలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ‌కు రూ.495.20కోట్లు స‌ర్దుబాటుచేయాల్సి ఉంద‌ని, ఆ నిధులు ఇప్పించేలా జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. ముఖ్యమంత్రి వెంట కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఎంపీలు ఎం.అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్. మల్లు రవి, బలరాంనాయక్, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, డా.క‌డియం కావ్య‌, కుందూరు రఘువీర్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హ‌నుమంత‌రావు ఉన్నారు.

Related posts

సంక్రాంతికి ఊరెళ్తున్నారా… అయితే జరభద్రం…!

Divitimedia

ఎస్.సి.ఇ.ఆర్.టి విధులకు ఎంపికైన ఇందిరాప్రియదర్శిని

Divitimedia

ఒడిశాలో పిడుగుల వర్షం

Divitimedia

Leave a Comment