మాదకద్రవ్యాలతో నష్టంపై అవగాహన కల్పించాలి
యాంటీ డ్రగ్ కమిటీ సమావేశంలో అదనపుకలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 12)
మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తెలిపారు. గురువారం ఐడీఓసీ కార్యాలయ సమావేశమందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అన్ని కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటున్న వారిని గుర్తించి, పునరావాస కేంద్రాల ద్వారా అలవాటు మాన్పించాలన్నారు. కళాశాలల్లో జరిగే పేరెంట్స్, టీచర్ సమావేశాలలో డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల అనర్ధాలపై వివరించాలన్నారు. మాదకద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్టచర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా విద్యార్థులు, యువతకు సమాజంలో మంచి, చెడులు తెలియజేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా చర్యలు చేపట్టాలని, ఒత్తిడికి గురయ్యే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, భయాన్ని పోగొట్టేందుకు కృషి చేయాలన్నారు. ఇతర మానసిక ఒత్తిడిలకు గురయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 14416 టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టెలిమానస్ కు కాల్ చేస్తే నిపుణులైన మానసిక వైద్యులు ఉచిత కౌన్సెలింగ్ సేవలందిస్తారని చెప్పారు. సమావేశంలో కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి భాస్కర్ నాయక్, ములకలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సులోచనరాణి, స్ట్రెస్ మేనేజ్మెంట్ అధికారి ఆదిశేషు, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్స్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.