CEIR పోర్టల్ ద్వారా 220 మొబైల్ ఫోన్లు రికవరీ
ఫోన్లు బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 11)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న 220 మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజు ప్రశంసించారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ చేతుల మీదుగా తిరిగి అప్పగించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి ఈ CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి తిరిగి అందజేయడం జరుగుతోందని ఎస్పీ రోహిత్ రాజు తెలియజేశారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వెంటనే CEIR పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా అడిగిన అన్ని రకాల వివరాలను కచ్చితంగా నమోదు చేసుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి వారి మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి కనిపెట్టే అవకాశం ఉంటుందని, మొబైల్ దొంగిలించబడినా, పోగొట్టుకున్నా వెంటనే CEIR పోర్టల్ ద్వారా తిరిగి వారి మొబైల్ ఫోన్లను పొందవచ్చని తెలిపారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ వేరే వ్యక్తి వినియోగించాలని ప్రయత్నించినప్పుడు మాత్రమే ఆ మొబైల్ ను ట్రేస్ చేయగలమన్నారు. ఈ సందర్భంగా బాధితుల మొబైల్ ఫోన్లు కనిపెట్టి వారికి అందజేయడంలో కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించి, వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, ఐటి సెల్ ఇంచార్జి సీఐ నాగరాజురెడ్డి, సభ్యులు విజయ్, రాజేష్, నవీన్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.