మహిళల భద్రతే ప్రధానలక్ష్యం : ఎస్పీ రోహిత్ రాజు
షీటీమ్స్, ఎ.హెచ్.టి.యు కార్యాలయాల్ని ప్రారంభించిన ఎస్పీ
పాత చుంచుపల్లి పోలీస్ స్టేషన్ భవనంలోకి షీటీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ విభాగాలు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 13)
మహిళలపై జరుగుతున్న నేరాలను అడ్డుకుని, వారికి న్యాయం చేయడానికి వీలుగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమే ‘షీటీమ్స్’ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఆయన శుక్రవారం కొత్తగూడెం పట్టణ పరిధిలోని పాత చుంచుపల్లి పోలీస్ స్టేషన్ భవనంలోకి మార్చిన జిల్లా షీటీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, లైంగికవేధింపులు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, బ్లాక్మెయిలింగ్, ఇతర ఇబ్బందులు ఎదుర్కునే మహిళలు జిల్లా షీటీమ్స్ ను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లా షీటీమ్స్ ఫోన్ నెంబర్ 8712682131 కి ఫోన్ చేసి తమ సమస్య తెలియజేసుకోవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయన్నారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే నేరస్తులను జిల్లా షీటీమ్ కార్యాలయానికి పిలిచి, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వబడుతుందని తెలిపారు. పరిస్థితిని బట్టి నిందితుడిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. బాలికలు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా షీటీమ్ ను సంప్రదించాలని తెలియజేశారు. జనం రద్దీగా ఉండే ప్రదేశాలలో, రైల్వేస్టేషన్, బస్టాండ్లు, కళాశాలల వద్ద షీటీమ్స్ సభ్యులు నిరంతరం సంచరిస్తూ ఆకతాయిల ఆగడాలు నిరోధించడం జరుగుతుందన్నారు. మానవ అక్రమరవాణా నివారించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ద్వారా పలు అక్రమాలు నిరోధించేందుకు అవకాశముందని తెలిపారు. మానవ అక్రమరవాణా చేసి అవయవాలు విక్రయించడం, వారితో వెట్టిచాకిరీ చేయించడం, వ్యభిచారంలోకి లాగడం, బాల్యవివాహాలు చేయడం లాంటివి జరగకుండా జిల్లాలో ఈ ప్రత్యేక విభాగం పని చేస్తుందని తెలిపారు. ఇటువంటి నేరాలు జరగకుండా చూడటానికి నిరంతరం జిల్లాలో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మఫ్టీ దుస్తులలో సంచరిస్తూ నేరాలు జరగడానికి అవకాశం ఉండే ప్రదేశాలలో ఎ.హెచ్.టి.యు, షీటీమ్ సిబ్బంది ఉంటారని తెలిపారు. ఈ సంవత్సర కాలంలో షీటీమ్, ప్రత్యేక బృందాలు కలిసి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 47కు పైగా కేసులు, 47 పెట్టీ కేసులు(రెడ్ హ్యాండెడ్), 92 అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) పరితోష్ పంకజ్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్బీ ఇన్స్పెక్టర్స్ నాగరాజు, శ్రీనివాస్, 1టౌన్ సీఐ కరుణాకర్, 2టౌన్ సీఐ రమేష్, సైబర్ క్రైమ్స్ సీఐ జితేందర్, ఆర్ఐలు సుధాకర్, రవి, లాల్ బాబు, కృష్ణారావు షీటీమ్స్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ నాగరాజురెడ్డి, ఆర్ఎస్సై రమాదేవి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.